హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేశుడు. ఏటికేడు ఎత్తైన విగ్రహంతో అంబరాన్నంటేలా గణేశ్ ఉత్సవాలు జరుగుతాయి. కానీ కరోనా వ్యాప్తి వల్ల ఈ ఏడాది గణపతి ఉత్సవాలు నిర్వహించరాదని ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. ఈ క్రమంలో కరోనా నిబంధనలు పాటిస్తూ గణపతి నవరాత్రులు నిర్వహించేందుకు అనుమతివ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ విజ్ఞప్తి చేసింది.
ప్రభుత్వం తరఫున ఉత్సవాల నిర్వహణ సాధ్యం కాదని.. అందుకు తగిన విధంగా కమిటీనే నిర్ణయం తీసుకోవాలని మంత్రి సూచించినట్లు కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ తెలిపారు. మహాగణపతి తయారీ విషయంలో ఆనవాయితీని కొనసాగిస్తూ... విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
వినాయకుడిని ఎత్తులో ఏర్పాటు చేస్తారనే విషయంపై ఉత్సవ కమిటీ సభ్యులు ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదన్నారు. వినాయక చవితికి ముందు పరిస్థితులను బట్టి ఎత్తు విషయంలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ... ముందుకు సాగుతామని పేర్కొన్నారు.
- ఇదీ చదవండి: వినాలంటే కొండెక్కాల్సిందే.. టెంట్ వేయాల్సిందే!