కర్ణాటక హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. దీని కారణంగా ఇప్పటికే కర్ణాటకలో విద్యాసంస్థలు మూతపడ్డాయి. దీంతో హైకోర్టు ఈ అంశంపై కొద్ది రోజులుగా విచారణ జరుపుతోంది. ప్రస్తుతానికి రాష్ట్రంలోని విద్యాసంస్థలను తెరవాలని, తరగతి గదుల్లో విద్యార్థులు శాలువాలు, హిజాబ్‌లు, స్కార్ఫ్‌లు, మతపరమైన జెండాల వంటివి ధరించకుంటా చూడాలని కోర్టు కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై తదపరి ఆదేశాలు వచ్చే వరకు వీటిని అమలు చేయాలని శుక్రవారం సూచించింది.
ఇదిలా ఉండగా.. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ హిజాబ్ వివాదంపై స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రచయిత ఆనంద్ రంగనాథన్ చేసిన పోస్టును స్క్రీన్ షాట్ తీసి.. దానిపై "మీకు ధైర్యం చూపించాలని ఉంటే అఫ్ఘానిస్తాన్‌కు వెళ్లి బురఖా లేకుండా ఉండండి. స్వేచ్ఛగా ఉండండి. మిమ్మల్ని మీరు బంధించుకోకండి" అంటూ పోస్టు పెట్టారు.
పాఠశాలల్లో హిజాబ్ నిషేధించడంపై ఆనంద్ రంగనాథన్ వ్యతిరేకంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన చేసిన పోస్టులో ‘ఇరాన్ 1973లో అని.. బికినీ వేసుకున్న అమ్మాయిల ఫొటోలు.. ప్రస్తుతం బుర్ఖాలు వేసుకున్న ఫొటోలతో.. చరిత్ర నుంచి తెలుసుకోలేని వాళ్లు దానిని రిపీట్ చేయాలనుకుంటున్నారు' అని పోస్టు చేశారు. దీనిపై కంగనా పైవిధంగా స్పందించారు.
ఇదీ చూడండి: ఇతర రాష్ట్రాలకూ హిజాబ్ వివాదం.. హైకోర్టు కీలక ఆదేశాలు