"సినీనటుడు సోనూసూద్ కనిపించే దేవుడు.. నేను ఆయన భక్తున్ని" అంటున్నాడు ఓ విద్యార్థి. సోనూను కలిసేందుకు హైదరాబాద్ నుంచి ముంబయికి పాదయాత్రగా బయలుదేరాడు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం దోర్నాలపల్లికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి వెంకటేశం.. తన పాదయాత్రను ప్రారంభించాడు. 65 నెంబర్ జాతీయ రహదారిపై జహీరాబాద్ మీదుగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. అడిగినా... అడగకపోయినా ఆపదలో ఉన్న వారికి సేవలందిస్తున్న రియల్ హీరోను కలిసేందుకు ముంబయి వెళ్తున్నట్లు వెంకటేశం తెలిపాడు.
కులమత భేదాలు లేకుండా దేశ వ్యాప్తంగా సేవలందిస్తున్న మనుషుల్లో దేవుడే సోనూసూద్ అని వెంకట్ కొనియాడాడు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా దేశవ్యాప్తంగా సేవలు చేస్తుండడం తనను ఆకట్టుకుందన్నాడు. సోనుసూద్‌పై ఉన్న తన అభిమానాన్ని పాదయాత్ర రూపంలో చూపేందుకు ముంబయి వెళుతున్నట్లు చెబుతున్నాడు. అందరిలాగే తన కుటుంబం కూడా సమస్యల్లో ఉందని... అది సోనూసూద్‌ను కలిసి చెప్పుకోనున్నట్లు వెంకట్ తెలిపాడు. పాదయాత్రగా అక్కడికి వెళ్లి, తనకు ఎలాంటి సహాయం అందక పోయినా... సోనుసుద్ను కలిశాను అనే సంతృప్తితో వెనక్కి వస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.