ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్‌లో సీఎస్ ఎస్కే జోషి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ఆర్టీసీ ఇన్‌ఛార్జ్ ఎండీ సునీల్‌శర్మ, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, ఆర్టీసీ, రవాణా శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
విశ్రాంత న్యాయమూర్తుల కమిటీ వేస్తాం..!
విశ్రాంత న్యాయమూర్తుల కమిటీపై ప్రభుత్వం అభిప్రాయం చెప్పాలంటూ హైకోర్టు సూచించిన నేపథ్యంలో.. కేసీఆర్ ప్రధానంగా దానిపైనే అధికారులతో చర్చించారు. ప్రభుత్వ అభిప్రాయాన్ని అడ్వొకేట్ జనరల్ ఇవాళ హైకోర్టుకు తెలపనున్నారు.
మీ అభిప్రాయం చెప్పండి..?
హైకోర్టు చట్టానికి అతీతం కాదని.. చట్టాల పరిధి దాటి వ్యవహరించలేదని మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది. సమస్య పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ అభిప్రాయం చెప్పాలని అడ్వొకేట్ జనరల్‌ను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
బలమైన వాదనలు వినిపించండి
వీటితో పాటు సమ్మె ప్రైవేట్ బస్సులకు రూట్ పర్మిట్ల కోసం ప్రభుత్వం తరఫున వినిపించాల్సిన వాదనలపై సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల కోణంలో, ప్రభుత్వ చర్యలను సమర్థిస్తూ హైకోర్టులో బలమైన వాదనలు వినిపించాలని సీఎం సూచించారు.
ఇదీ చదవండి: 'కమిటీతో సమస్య పరిష్కారం అవుతుందని చిన్న ఆశ...!'