లాక్‌డౌన్ వేళ ఉపాధి దొరక్క హైదరాబాద్‌లో పలువురు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారిని జీహెచ్ఎంసీ, అక్షయపాత్ర అమ్మలా ఆదరిస్తున్నాయి. అన్నపూర్ణ కేంద్రాల ద్వారా పేదవారి ఆకలి తీరుస్తున్నాయి.
45 వేల మందికి ఉచితంగా భోజనం..
జంటనగరాల్లో 150 అన్నపూర్ణ కేంద్రాల ద్వారా అన్నార్తులకు బల్దియా భోజనం అందిస్తోంది. వీటి సంఖ్యను మరో వందకు పెంచాలని ప్రభుత్వం ఆదేశించడంతో గత మూడు రోజుల నుంచి 250 అన్నపూర్ణ కేంద్రాల ద్వారా భోజనం పంపిణీ జరుగుతోంది. ప్రతి రోజు 45 వేల మందికి ఉచితంగా భోజనం పెడుతున్నారు. మెనూను తప్పనిసరిగా అమలు చేస్తున్నారు.
కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించడం వల్ల రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. వర్తక వ్యాపార సంస్థలు, విద్యాలయాలు, పరిశ్రమలు మూసివేశారు. దీంతో ఇబ్బంది పడుతున్న వలస కార్మికులు, చిరుద్యోగులు, రోజువారీ కూలీలు, నిరాశ్రయులు, వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది.
హర్షం..
ప్రధాన ఆస్పత్రులు, బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, కూలీల అడ్డాలు, జంక్షన్లు ఉన్న చోట్ల అన్నపూర్ణ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆకలి తీరుస్తోంది. సమతుల పోషక పదార్థాలతో అందిస్తున్న అన్నపూర్ణ ఉచిత భోజనం పట్ల వలస కార్మికులు, నిరాశ్రయులు, విద్యార్థులు, చిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీచూడండి: రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడిగించిన ప్రభుత్వం