రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ... ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్‌కు తరలించారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేశ్ రెడ్డితోపాటు మరో పది మంది కిసాన్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నం ప్రగతిభవన్ దగ్గరకు చేరుకున్న నాయకులను పోలీసులు చుట్టుముట్టారు. అదుపులోకి తీసుకుంటున్న సమయంలో... పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.
నాయకులను బలవంతంగా లాక్కెళ్లి వ్యానుల్లోకి పోలీసులు ఎక్కించారు. ఈ క్రమంలో పోలీసులకు, కాంగ్రెస్ నేతలకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకున్నాయి. లాక్కెళ్లినప్పుడు ఒకరిద్దరికి చిన్నపాటి గాయాలు అయ్యాయి. మొదట పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు తరలించిన పోలీసులు... కాంగ్రెస్ నేతలు నిరసన చేసే అవకాశం ఉందని భావించి గోషామహల్ స్టేడియానికి తరలించారు.
ఎమ్మెల్యే సీతక్క, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డితో పాటు మరికొందరు కిసాన్ కాంగ్రెస్ నేతలను అరెస్టు చేయడాన్ని ఖండించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.... పరామర్శించేందుకు గోషామహల్ స్టేడియం వెళ్లనున్నట్లు తెలిపారు.