కష్టాలు ఎన్నటికీ శాశ్వతం కాదు అనే విషయాన్ని గుర్తించాలి. తాత్కాలికమైన విపత్తును ప్రపంచం ఎదుర్కొంటోంది. వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటే కొద్దిరోజుల్లోనే సమస్య నుంచి బయటపడొచ్చు. నివారణతోనే పరిష్కారం ఉంటుందని అందరూ గుర్తించాలి. పోరాడాలి అనే తత్త్వాన్ని పెంపొందించుకోవాలి. వైరస్ వల్ల ప్రాణాలు పోతున్నాయన్నది నిజమే. కానీ వైరస్‌ను ఎదుర్కొని ప్రాణాలతో భయపడిన వృద్ధులు, యువకులు ఉన్నారన్న సంగతి మర్చిపోవద్దు.
సందర్భాన్ని అంగీకరించండి..
(Accept the situation)
మా ప్రాంతంలో ఎవరికీ వైరస్ సోకలేదనే ఆశావహ దృక్పథాన్ని అలవర్చుకోవాలి. ఎవరికైనా సోకినా వారికి దూరంగా, ఇంట్లోనే ఉన్నామన్న ధీమాతో ఉండాలి. రుణాత్మక భావోద్వేగాల వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుందని ప్రయోగాత్మకంగా నిరూపితమైందనే విషయాన్ని మరిచిపోకూడదు. ప్రస్తుతం మీద దృష్టి పెడుతూ రెండు మూడు నెలలు పనులు జరగకపోయినా, ఆర్థికంగా కుంగిపోయినా తర్వాత కుదురుకుంటామనే విశ్వాసంతో పోరాడాలి. రెట్టింపు శక్తితో జరిగిన నష్టాన్ని పూడ్చుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి.
ఓపికతో ఉండండి
(Be patient during lockdown)
అలవాటు లేక ఇంట్లోనే రోజుల తరబడి గడపడం అందరికీ విసుగ్గానే అనిపిస్తుంటుంది. జనవరిలో వైరస్ దాటికి కుంగిపోయిన చైనా మూడు నెలల తర్వాత కుదురుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. పునరుత్తేజంతో మనమూ కుదురుకుంటామనే ఆశావహ దృక్పథంతో ఉండాలి. మనస్సుకు అలా సర్ది చెప్పుకోవాలి.
మానసిక, శారీరక ఆరోగ్యం పట్ల జాగ్రత్త
(Careful about physical and mental health)
విసుగుతో ఏ పని చేయాలన్నా ఉక్రోషం వస్తుంటుంది. సరిగా ఆహారం తీసుకోరు. శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఉదయమే ఇంటి డాబాపైన నడవాలి, ఉదయం, సాయంత్రం వేళల్లో సూర్యరశ్మి తాకేలా చూసుకోవాలి. ఇంట్లోనే సులభమైన వ్యాయామాలు చేయాలి. ఉత్సాహాన్ని పెంచే ఆటలు ఆడుకోవాలి. బలవర్థకమైన ఆహారాన్ని తీసుకోవాలి.
ఆశావహ దృక్పథం అలవర్చుకోవాలి
(Develop positive hope)
ఎన్నిరోజులు ఇలా బందీగా ఉండాలో. ఇంట్లో ఉంటే పిచ్చి పట్టినట్లు అనిపిస్తోంది. ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోవాలనిపిస్తుంది అంటూ ఇప్పటికే చాలామంది మానసిక వైద్యుల వద్దకు వెళ్తున్నారు. నిరాశావాదం నుంచి ఆశావాదం వైపు అడుగులు వేయాలి. మనసును మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి. రుణాత్మక ఆలోచనలను రానివ్వద్దు. వాటిని పట్టించుకోవద్దు.
ఇవీ చూడండి: 'యువతకు కరోనా రాదనుకుంటే పొరపాటే'