ఆన్లైన్ మోసాలు... ఎక్కడ చూసినా ఇదే మాట. ఒకప్పుడు ఇంట్లో ఎవరూ లేనప్పుడు చూసి, తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడేవారు. అయితే ఇంటర్నెట్ యుగంలో అంత పనిచేయాల్సిన అవసరం లేదు. ఆధునిక సాంకేతిక సహాయంతో.. దర్జాగా ఇంట్లోనే కూర్చొని మరీ మోసాలకు పాల్పడవచ్చు.
చదువురాని వాళ్లనే కాదు... విద్యావంతులనూ బురిడీ కొట్టిస్తున్నారు ఆన్లైన్ ఘరానా మోసగాళ్లు. మరి వీరి బారి నుంచి ఎలా బయటపడాలి..? మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి..?
ఫ్యాన్సీ నెంబర్ల మోజులో...
గతంలో సైబర్ నేరగాళ్లు బ్యాంకు అధికారుల పేరుతో ఖాతాదారులకు ఫోన్లు చేసి, డెబిట్‌కార్డు, పిన్, సీవీవీ నెంబర్లు తెలుసుకునేవారు. తరువాత ఖాళీ డెబిట్ కార్డులను కార్డు రీడర్‌తో రీడ్‌చేసి అసలైన ఖాతాదారుల వివరాలతో నకిలీ డెబిట్ కార్డులు సృష్టించేవారు. అలా ఖాతాదారుల అకౌంట్ల నుంచి నగదు దోచుకునేవారు.
ప్రస్తుతం ఈ క్లోనింగ్ ప్రక్రియను నేరగాళ్లు కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. తొలుత కొన్ని ఈ-కామర్స్, టికెట్ బుకింగ్లాంటి వెబ్సైట్లు, యాప్‌ల్లోకి వెళ్లి బ్యాంకు ఖాతాదారుల నెంబర్లను నాటకీయంగా కనిపెడుతున్నారు. సాధారణంగా కొన్ని బ్యాంకు డెబిట్ కార్డులకు గల 16 అంకెల్లోని తొలి 6 అంకెలు ( బ్యాంకు ఐడెంటిఫికేషన్ నంబర్) ఏకరీతిలో ఉండటం వల్ల మిగిలిన పది అంకెలను అంచనా కొద్దీ నమోదు చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో 16 అంకెలు సరిగ్గా నమోదు చేస్తే సదరు యాప్‌లో చెల్లింపుల ప్రక్రియకు దారితీస్తుంది. ఈ విధంగా ఓ డెబిట్ కార్డు ఖాతాదారుడిని సైబర్ నేరగాళ్లు గుర్తిస్తారు.
ర్యాండమ్ ఫ్యాన్సీ నెంబర్లతో..
తరువాత ఏకంగా బ్యాంకుల కాల్ సెంటర్లకు ఫోన్ చేసి, నాలుగు అంకెల పిన్ నెంబర్‌ను ర్యాండమ్‌గా నమోదు చేస్తున్నారు. ఇక్కడే వారికి కలసి వస్తోంది. ఎక్కువ మంది ఫ్యాన్సీ నెంబర్లనే తమ పిన్లుగా పెట్టుకుంటున్నారు. అందువల్ల సైబర్ నేరగాళ్లు 1234, 0000, 1122, 9999 తరహా ఫ్యాన్సీ నెంబర్లను వాడి చివరకు అనుకున్నది సాధిస్తున్నారు. అలా బాధితుడి ఖాతాలోని నగదు నిల్వలను తెలుసుకుంటున్నారు.
తరువాత క్లోనింగ్ ప్రక్రియ ద్వారా బాధితుడి డెబిట్‌కార్డు నంబర్, పిన్ వివరాలతో నకిలీ కార్డులు సృష్టిస్తున్నారు. దర్జాగా ఏటీఎంల్లో నగదు డ్రా చేస్తున్నారు.
3 లక్షల ప్రయత్నాలు..
ఇటీవల ఝార్ఖండ్‌లోని జాంతారా జిల్లాకు చెందిన సైబర్ నేరగాళ్ల ముఠా రూ.3 కోట్లను ఓ ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు ఖాతాల నుంచి కొట్టేసింది. కేవలం 3 వేల కార్డుల వివరాలు తెలుసుకునేందుకు వారు 3 లక్షల సార్లు ప్రయత్నించి సఫలమయ్యారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
* డెబిట్కార్డులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్యాన్సీ నెంబర్లను పిన్‌గా పెట్టుకోకూడదు.
* వాహనం నంబర్లు, పుట్టిన తేదీలు, వరుస సంఖ్యలు, అదృష్ట సంఖ్యలు పెట్టుకోకూడదు.
* పిన్ నెంబర్ తరచూ మారుస్తుండాలి.
* అనుమానాస్పద లావాదేవీలు కనిపిస్తే వెంటనే బ్యాంకులకు ఫిర్యాదు చేయాలి.
ఇదీ చూడండి: డేటింగ్ యాప్ కోసం అంత ఖర్చా...?