టెక్ దిగ్గజాలు గూగుల్, అమెజాన్.. మీడియా స్ట్రీమింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం వల్ల త్వరలో ఒక సంస్థకు చెందిన వీడియో స్ట్రీమింగ్ యాప్‌లు మరో సంస్థ ప్లాట్‌ఫాంలో వీక్షించే వీలుకలగనుంది. ఈ విషయాన్ని రెండు సంస్థలు అధికారికంగా ప్రకటించాయి.
గూగుల్‌కు చెందిన యూట్యూబ్ సహా స్ట్రీమింగ్ యాప్‌లు త్వరలో అమెజాన్ ఫైర్ టీవీలో లభ్యం కానున్నాయి. తద్వారా యూట్యూబ్ వీడియోలు, మ్యూజిక్, సినిమాలు ఇలా అన్నింటిని వీక్షించే వీలు కలగనుంది.
అమెజాన్ ప్రైమ్ చందాదారులు క్రోమ్‌కాస్ట్, ఆండ్రాయిడ్ టీవీల్లో అమెజాన్ యాప్ ద్వారా వీడియోలు వీక్షించొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఈ సంయుక్త సేవలు కొద్ది నెలల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇరు సంస్థలు తెలిపాయి.
ఇప్పటి వరకు ఒక సంస్థ ప్లాట్‌ఫాంను వినియోగించే వారికి మరో సంస్థ వీడియోలు చూసేందుకు వీలుండేది కాదు. తాజా ఒప్పందంతో ఆ సమస్య తీరనుంది.
"ప్రపంచ వ్యాప్తంగా అమెజాన్ ఫైర్ టీవీలో యూట్యూబ్ యాప్‌ను ప్రారంభించడం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాం." - హీథర్ రివెరా, యూట్యూబ్ ఉత్పత్తి భాగస్వామ్య అధిపతి
"అమెజాన్ ప్లాట్‌ఫాంపై యూట్యూబ్ సేవలు అందుబాటులోకి రానుండటం వల్ల వీడియోలు వీక్షించేందుకు యూజర్లకు మరింత సౌలభ్యంగా ఉంటుంది."
-ఆండ్రూ బెన్నెట్, ప్రైమ్ వీడియో అభివృద్ధి వ్యాపారాల అధిపతి