కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తీసుకున్న బ్యాంకుల విలీనం నిర్ణయంపై కొన్ని వర్గాల నుంచి అసమ్మతి ఎదురవుతూనే ఉంది. ఈ ప్రభుత్వ బ్యాంకుల సమ్మేళనంతో పలు శాఖల తొలగింపుతో పాటు.. ఎందరో ఉద్యోగాలు కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేసింది అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈయూ).
నేడు పలు అంశాలపై విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన కేంద్ర మంత్రి... బ్యాంకు ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తున్న అంశంపైనా మాట్లాడారు.
''కచ్చితంగా.. తప్పుడు సమాచారం. నేను ఈ బ్యాంకులకు చెందిన ప్రతి ఒక్క యూనియన్కూ భరోసా ఇవ్వాలనుకుంటున్నా. ఒక్కసారి గత శుక్రవారం నేనేం చెప్పానో గుర్తుతెచ్చుకోండి. మేం.. బ్యాంకుల సమ్మేళనంపై మాట్లాడినప్పుడు వాస్తవాన్ని చాలా స్పష్టంగా చెప్పాం. ఏ ఒక్క ఉద్యోగిని తొలగించబోం. అలా ఎప్పటికీ జరగదు.''
- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి.
నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని ఆర్థిక శాఖ.. 10 ప్రభుత్వ బ్యాంకులను విలీనాన్ని శుక్రవారం ప్రకటించింది. 27గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను 12కు కుదించింది. ఐదేళ్ల కనిష్ఠానికి చేరిన ఆర్థిక వృద్ధి పుంజుకునే దిశగా ఈ నిర్ణయం.. ఉపకరిస్తుందని అభిప్రాయపడింది.