హైదరాబాద్‌లో అక్రమంగా నివసిస్తున్నారంటూ రోహింగ్యాలను రాష్ట్ర ప్రభుత్వం జైళ్లో పెట్టడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. వారిని నిర్బంధించడం చట్టవిరుద్దమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో గతేడాది పోలీసులు సోదాలు నిర్వహించి... అనుమతి లేకుండా నగరంలో ఉంటున్న పలువురు రోహింగ్యాలను అదుపులోకి తీసుకున్నారు. వారిని దేశం నుంచి పంపించడంతో పాటు కేసుల విచారణ పూర్తయ్యే వరకు చర్లపల్లి జైళ్లో పెట్టాలని గతేడాది అక్టోబరు 4న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్రానికే అధికారం: ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పలువురు రోహింగ్యాలను హైకోర్టును ఆశ్రయించారు. దేశంలో అక్రమంగా ప్రవేశించారన్న ఆరోపణపై జైళ్లో నిర్బంధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని.. దానిపై కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వారి తరఫు న్యాయవాదులు వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం రోహింగ్యాలను జైళ్లో నిర్బంధించాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేసింది.
ఎవరీ రోహింగ్యాలు: హైదరాబాద్ నగరంలో సుమారు ఆరు వేల మంది రోహింగ్యాలు వున్నారని గతంలో అప్పటి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రోహింగ్యాలు ప్రధానంగా మయన్మార్ దేశంలోని రఖైన్ రాష్ట్రానికి చెందిన వారు. వీళ్లను ఆ దేశం తమ పౌరులుగా గుర్తించడం లేదు. 2012లో వీరిపై అక్కడి ఆర్మీ చర్యలకు దిగింది. దీంతో వీరు కట్టుబట్టలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వేరే దేశాలకు వలసవెళ్లారు. ఎక్కువ మంది బంగ్లాదేశ్‌లో తలదాచుకున్నారు. మరికొందరు మలేషియా, ఇండోనేషియా వైపు వెళ్లి స్థిరపడ్డారు.
బంగ్లాకు తలనొప్పిగా రోహింగ్యాలు: బంగ్లాదేశ్ మీదుగా చాలామంది భారతదేశంలోకి కూడా ప్రవేశించారు. వీరిలో కొందరు హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడే ఉంటున్నారు. ఇటీవల భారత్ వచ్చిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా.. లక్షల మంది రోహింగ్యా శరణార్థులు బంగ్లాదేశ్‌కు సమస్యాత్మకంగా మారారని అన్నారు. భారత్ పెద్ద దేశమని.. రోహింగ్యా శరణార్థులకు ఆశ్రయం ఇవ్వొచ్చని ఆమె వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి:
వీళ్లు 'అగ్రి' ఆవిష్కర్తలు.. ఏం చేసినా అది అన్నదాత కోసమే..
74 ఏళ్ల తరువాత దేశంలోకి చీతాలు.. మోదీ బర్త్‌డే రోజున ఆ పార్క్‌లోకి విడుదుల