పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ కుమారుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ రానున్న పంజాబ్ ఎన్నికలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. 2022 అసెంబ్లీ ఎన్నికలలో జలాలాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ఆదివారం ప్రకటించారు. జలాలాబాద్‌లో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
"శిరోమణి అకాలీ దళ్ పార్టీ తరఫున వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు మొదటి అభ్యర్థిని ప్రకటిస్తున్నాను. జలాలాబాద్ నియోజకవర్గం నుంచి నేను పోటీ చేస్తున్నాను. 2009లో తొలిసారి నేను ఈ ప్రాంతంలో పోటీ చేసినప్పటి నుంచి మీరు నన్ను ఆదరిస్తున్నారు. అందుకు ప్రతిగా నేను నా శక్తి మేరకు కృషి చేశాను. రోడ్ల నిర్మాణం, పాఠాశాల అభివృద్ధి, బాలికల కళాశాల ఏర్పాటు, రూ. 50 కోట్లతో ఆస్పత్రి, రూ.25 కోట్లతో స్టేడియం నిర్మాణానికి కృషి చేశాను. జలాలాబాద్ ప్రజలతో నాకు మంచి బంధం ఉంది. అది నేను జీవితాంతం నిలబెట్టుకుంటాను. మేము అధికారంలోకి వస్తే కూరలు, పండ్లు, పాలకు కనీస మద్దతు ధర ఏర్పాటు సహా దళారులకు సరిపడా కమీషన్ అందేలా చర్యలు తీసుకుంటాము. "
-సుఖ్బీర్ సింగ్ బాదల్, శిరోమణి అకాలీ దళ్ అధ్యక్షుడు
ప్రభుత్వంపై విమర్శలు..
ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌పై బాదల్ తీవ్ర విమర్శలు చేశారు. నాలుగేళ్ల పాలనలో ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసిన ఒక్క పని గురించి అయినా ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. నాలుగేళ్లలో ముఖ్యమంత్రి కేవలం 11 సార్లే సీఎం కార్యాలయానికి వెళ్లారని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి : అసోం మినహా ఎక్కడా భాజపా గెలవదు: పవార్