ఆర్మీ పరీక్షా పత్రం లీకైన కేసులో అరెస్టైన సికింద్రాబాద్‌కు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ భగత్ప్రీత్ సింగ్ బేడీ(44) అనే ఉన్నతస్థాయి సైనికాధికారిని ప్రధాన నిందితునిగా తేల్చారు పోలీసులు. స్థానిక పరీక్షా కేంద్రాలకు ప్రశ్నాపత్రాలను ముద్రించే బాధ్యతను నిర్వహించిన బేడీకి.. నార్నెపాటి వరప్రసాద్ అనే వ్యక్తి సహకరించినట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు తొమ్మిది మందిని అరెస్టు చేశారు పోలీసులు.
లీకేజీ ఇలా..
సికింద్రాబాద్ ఏఓసీ కేంద్రంలో పేపర్ ప్రింటింగ్ బాధ్యతలు చూస్తున్న బేడీ.. పరీక్షకు చివరి నిమిషంలో ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి విఠల్ పాటిల్ వివరించారు. ప్రింటింగ్ సమయంలో సీసీటీవీ కెమెరాలకు చిక్కకుండా పేపర్‌ను పొందిన బేడీ.. దానిని సికింద్రాబాద్‌లోని ఓ హోటల్లో ఉన్న వరప్రసాద్‌కు పంపినట్లు గుర్తించారు. అతని నుంచి నర్సింగ్‌రావు అనే వ్యక్తికి.. అనంతరం పవన్ అనే వ్యక్తికి పేపర్ చేరగా.. పవన్ దీనిని విలాస్ కిలారి అనే మేజర్ ర్యాంక్ అధికారికి పంపించాడు. అతని నుంచి మరో ప్రధానాధికారి అయిన తిరుమురుగన్ తంగవేలుకు చేరవేసినట్లు పోలీసులు వివరించారు.
డబ్బులు వెనక్కి..
ఒక్కో అభ్యర్థి నుంచి రూ.లక్ష రూపాయలు బేడీకి అందాల్సి ఉండగా.. కొంత డబ్బును అడ్వాన్సుగా తీసుకున్నాడు. అయితే పరీక్ష రద్దైనందున వారికి తిరిగి ఇచ్చేయాల్సి వచ్చిందని పోలీసులు వివరించారు. పుణె కోర్టు బేడీకి మే 25 వరకు పోలీసు కస్టడీ విధించింది.
ఈ లీకేజీ వ్యవహారంతో.. దేశవ్యాప్తంగా సాధారణ సిబ్బంది నియామకం కోసం ఫిబ్రవరి 28న జరగాల్సిన ప్రవేశ పరీక్షను రద్దు చేసింది ఆర్మీ.
ఇవీ చదవండి: 'ఆర్మీ' పేపర్ లీక్- దేశవ్యాప్తంగా పరీక్ష రద్దు