Rechargeable E Bike: ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయేతర ఇంధన వనరులపై అవగాహన పెరుగుతోంది. ప్రజలు.. పర్యావరణహిత వాహనాలను వినియోగించాల్సిన అవసరాన్ని గుర్తిస్తున్నారు. మోటార్ కంపెనీలు సైతం సోలార్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీని పెంచేస్తున్నాయి. అయితే వాటి ధరలు, ఛార్జింగ్ సదుపాయాలలేమి, బ్యాటరీ సామర్థ్యం లాంటివి సవాలుగా నిలుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ఆవిష్కరణతో ముందుకు వచ్చాడు ధనుష్ కుమార్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి. వాటికి పరిష్కారంగా 'మ్యానువల్ రీఛార్జబుల్ ఈ-బైక్'ను అభివృద్ధి చేశాడు.
తమిళనాడులోని మధురై అమెరికన్ కళాశాలలో ఫిజిక్స్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు ధనుష్. అతడు కొన్ని నెలల కిందట సౌర శక్తితో నడిచే సైకిల్‌ను కూడా రూపొందించాడు.
ఈ-బైక్ ఎలా పనిచేస్తుంది?
"నేను ఇదివరకు తయారు చేసిన సోలార్ బైక్ కన్నా ఇది (మ్యానువల్ ఈ-బైక్) మూడు రెట్లు సమర్థవంతంగా పనిచేస్తోంది. దీనిలో పెడలింగ్ వ్యవస్థను అమర్చాను. పెడల్ తొక్కుతుంటే సైకిల్ రీఛార్జ్ అవుతుంది. కార్లలో వాడే ఆల్టర్నేటర్ పెడలింగ్ చైన్‌కు అనుసంధానించాను. దాని వల్ల ఈ-బైక్ ఆటోమెటిక్‌గా ఛార్జ్ అవుతుంది. కాబట్టి, ప్రయాణంలో ఎలాంటి అంతరాయం ఏర్పడదు."
-ధనుష్ కుమార్, విద్యార్థి
ఈ- బైక్ సామర్థ్యం ఎంత?
"ఈ-బైక్ ఒకసారి ఛార్జ్ అయితే.. గంటకు 100 కి.మీల వేగంతో సరాసరి 40కి.మీలు ప్రయాణం చేయొచ్చు. అప్పడు ఛార్జ్ అయిపోతే.. గంటసేపు పెడలింగ్ (తొక్కడం) ద్వారా మళ్లీ ఛార్జ్ అవుతుంది. బ్యాటరీతో పాటు ఆల్టర్నేటర్ పవర్ కూడా ప్రయాణానికి ఉపకరిస్తుంది. సోలార్ బ్యానర్కైతే ఎక్కువ స్థలం కావాల్సి ఉంటుంది. కానీ, ఈ- బైక్‌కు అంత అవసరం లేదు. పైగా ఇది పర్యావరణహితం, ఆరోగ్యకరం." అని చెప్పాడు ధనుష్ కుమార్.
తల్లి నగలు అమ్మి విద్యాభ్యాసం..
దీనిని ప్రజలకు చేరువ చేసేందుకు కోయంబత్తూర్‌లోని ఓ ప్రైవేట్ సంస్థతో పనిచేస్తున్నాడు ధనుష్. తన తల్లి నగలను అమ్మి చదువును కొనసాగిస్తున్నట్లు తెలిపాడు. అంతేకాక, తమిళనాడు రూరల్ ఇండస్ట్రీస్ మినిస్టర్ టీ.ఎం. అన్బరసన్ తనకు ఆర్థిక సహకారాన్ని అందించడం గర్వంగా ఉందని చెప్పాడు. తన ప్రయత్నంలో కళాశాల ప్రిన్సిపల్, డిపార్ట్మెంట్ హెడ్ ప్రోత్సాహం ఎంతో ఉందన్నాడు.
ప్రత్యేకత అదే..
"ధనుష్ గతంలో తయారు చేసిన సైకిల్.. ఛార్జింగ్ సమస్యను ఎదుర్కొంది. దానికి ఛార్జింగ్ ఇంట్లోనే పెట్టి, ప్రయాణించాల్సి వచ్చేది. కానీ, ప్రస్తుత ఈ-బైక్‌లో పెడలింగ్ ద్వారా ఛార్జ్ కాగల సామర్థ్యం ఉంది. అదే దాని ప్రత్యేకత" అని ధనుష్ కుమార్ టీచర్ డా.మూర్తి కొనియాడారు.
ఇదీ చూడండి:
మాస్టార్ ఐడియా అదుర్స్- సైకిల్‌నే 'స్మార్ట్ స్కూల్'గా మార్చి...