ఆస్తిపై స్పష్టమైన హక్కును కల్పించేందుకు తీసుకొచ్చిన 'స్వామిత్వ యోజన'తో(svamitva scheme property card) గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతోందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(pm modi news). దేశంలోని గ్రామాల అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ హర్దా జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో స్వామిత్వ(svamitva scheme) లబ్ధిదారులతో వర్చువల్‌గా మాట్లాడారు మోదీ.
" పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, రాజస్థాన్, హరియాణా, కర్ణాటకలో ఈ పథకం విజయవంతమైంది. ఇప్పుడు, ప్రజలకు ఆస్తి హక్కుపై ధ్రువీకరణ కార్డులు అందించేందుకు దేశవ్యాప్తంగా అమలు చేస్తాం. ఇది గ్రామ స్వరాజ్యానికి ఉదాహరణగా నిలుస్తుంది. ఇప్పటి వరకు ఆయా రాష్ట్రాల్లో 22 లక్షల కుటుంబాలకు సంబంధించిన కార్డులు సిద్ధమయ్యాయి. మధ్యప్రదేశ్‌లో ఇప్పటికే 3వేల గ్రామాల్లో 1.70 లక్షల కార్డులు (e-property cards )అందించాం. గ్రామాల్లో ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పులు తీసుకోవటం వల్ల ఎదురయ్యే సమస్యల నుంచి స్వామిత్వ యోజన కాపాడుతుంది. ఆస్తి హక్కుల కార్డులతో నేరుగా బ్యాంకుల ద్వారానే రుణాలు తీసుకోవచ్చు."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
ఏమిటీ స్వామిత్వ?
గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు, భూములకు సంబంధించి కచ్చితమైన ఆస్తి హక్కు పత్రాలను(e-property cards) సృష్టించి లబ్ధిదారులకు అందించేందుకు ఉద్దేశించిన పథకమే స్వామిత్వ(svamitva yojana ). వచ్చే నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 6.2 లక్షల గ్రామాల్లోని ఆస్తులను సర్వే చేసి ఆస్తి హక్కు కార్డులు అందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది ఏప్రిల్ 24న ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వామిత్వ యోజన (యాజమాన్య ప్రణాళిక)ను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఆరు నెలల్లో ఆరు రాష్ట్రాల్లోని 763 గ్రామాల్లో సర్వే పూర్తిచేసి 1.32 లక్షల మంది ఆస్తి హక్కు పత్రాలను తయారు చేశారు. డ్రోన్ సర్వే సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గ్రామాల్లోని ఇళ్లను సర్వే చేసి ప్రజలకు రికార్డ్ ఆఫ్ రైట్స్ కార్డులు మంజూరు చేస్తారు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పథకం. పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ దీనికి నోడల్ ఏజన్సీగా వ్యవహరించనుంది. రాష్ట్రాల్లో రెవెన్యూ, ల్యాండ్ రికార్డ్ శాఖలు నోడల్ ఏజెన్సీలుగా వ్యవహరిస్తాయి. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖతో కలిపి ఆ రెండు విభాగాలు సర్వే పూర్తిచేస్తాయి. సర్వే ఆఫ్ ఇండియా సంస్థ ఈ పథకం అమలులో సాంకేతిక భాగస్వామిగా వ్యవహరించనుంది.
- 2024 మార్చి నాటికి 6.2 లక్షల గ్రామాల ఆస్తులను సర్వే చేస్తారు.
- గ్రామాల ప్రణాళికను క్రమబద్ధీకరిస్తారు. పన్ను వసూళ్లు పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. గ్రామీణప్రాంతాల్లో ఆస్తి హక్కులపై స్పష్టతనిస్తారు.
ఇదీ చూడండి: గ్రామీణులకు ఆధార్ తరహాలో ప్రాపర్టీ కార్డులు