Medical negligence in India: దగ్గు మందు అనుకుని పేల మందు తాగిన ఓ వృద్ధురాలు తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ షాడోల్ జిల్లాలోని ధన్‌పురి ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. 65 ఏళ్ల రాజ్‌కుమారి జైస్వాల్ కొద్దిరోజులుగా దగ్గుతో బాధపడుతోంది. చికిత్స కోసం బుర్హార్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. అక్కడి వైద్యులు ఆమె పరిస్థితిని పరిశీలించి, మందుల చీటీ రాసిచ్చారు. ప్రిస్క్రిప్షన్‌లోని ఔషధాల్ని ఆరోగ్య కేంద్రం నుంచే తీసుకుని, ఇంటికి వెళ్లింది రాజ్‌కుమారి.
దగ్గు తగ్గి, ఉపశమం లభిస్తుందన్న ఆశతో ఆస్పత్రిలో ఇచ్చిన సిరప్‌ను తాగింది రాజ్‌కుమారి. వెంటనే ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆమె ఏం ఔషధం వేసుకుందా అని అప్పుడు చూశారు. అది దగ్గు మందు కాదు పేల మందు అని తెలుసుకుని కంగుతిన్నారు.
ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులకు రాజ్‌కుమారి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే.. ఆరోగ్య కేంద్రం సిబ్బంది స్పందన మరోలా ఉంది. "మేము దగ్గు మందే రాసి ఇచ్చాం. అయితే ఆమె హడావుడిలో మరో రోగి కోసం రాసిన ప్రిస్క్రిప్షన్ తీసుకుని వెళ్లిపోయింది" అని చెప్పారు బుర్హార్ మండల వైద్యాధికారి సచిన్ కర్ఖుర్.
వెన్ను నొప్పికి పశువుల ఇంజెక్షన్: మరోవైపు.. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఓ నకిలీ వైద్యుడు పశువుల ఇంజెక్షన్లు ఇస్తున్న ఘటనలు ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో కలకలం సృష్టిస్తున్నాయి. మహులదిహా గ్రామానికి చెందిన శ్రీకంఠం అనే వ్యక్తి వెన్నునొప్పితో బాధపడుతుండగా కొద్దిరోజుల క్రితం పశువుల ఇంజెక్షన్ ఇచ్చాడు బిశ్వనాథ్ బెహరా అనే నకిలీ వైద్యుడు. ఇప్పుడు అదే వైద్యుడు మరో వ్యక్తికి సైతం పశువుల ఇంజెక్షన్ ఇచ్చినట్లు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నిందితుడు బిశ్వనాథ్ బెహరా కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రోగి పొట్టలో కాటన్ వదిలేసి..: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ వైద్యురాలి నిర్లక్ష్యంపై ఆ రాష్ట్ర వివాద పరిష్కారాల కమిషన్ కొరడా ఝుళిపించింది. ఓ మహిళకు ఆపరేషన్ చేస్తూ.. పొట్టలో కాటన్‌ను వదిలిపెట్టిన ఘటనపై సీరియస్ అయింది. బాధితురాలికి రూ.45.39 లక్షలు చెల్లించాలని ఆస్పత్రి వైద్యురాలిని ఆదేశించింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.