ఉత్తర్ప్రదేశ్ లఖింపుర్ ఖేరి ఘటనపై (Lakhimpur Kheri news) సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. యూపీ ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే.. 68 మంది సాక్షుల్లో 30 మంది వాంగ్మూలాన్ని రికార్డు చేసినట్లు తెలిపారు. అందులో 23 మంది తమను తాము ప్రత్యక్ష సాక్షులుగా చెప్పుకున్నారని వెల్లడించారు. వీరు కారుతో పాటు, అందులో ఉన్న వ్యక్తులను చూశారని వివరించారు.
దీనిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం (Lakhimpur Kheri Supreme Court).. ప్రత్యక్ష సాక్షులు 23 మందే ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వందల మంది రైతులు ఘటన జరిగిన ప్రాంతంలో ఉంటే.. 23 మంది ప్రత్యక్ష సాక్షులే ఉండటం ఏంటని ప్రశ్నించింది.
ప్రశ్నల వర్షం
దీంతో పాటు యూపీ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది సీజేఐ ధర్మాసనం. ఎంతమంది సాక్షుల నుంచి 164 నిబంధన కింద స్టేట్‌మెంట్ రికార్డు చేశారని అడిగింది. సాక్షులకు భద్రత కల్పించే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆదేశించింది. సాక్షులకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించాల్సిందేనని తేల్చి చెప్పింది.
విచారణ వాయిదా
గాయపడిన వారెవరైనా సాక్షుల్లో ఉన్నారా అని ప్రశ్నించిన ధర్మాసనం... చనిపోయిన జర్నలిస్టు కశ్యప్, మరో మృతుడు శ్యామ్‌సుందర్ మరణంపై విచారణ పురోగతి నివేదికను అందించాలని స్పష్టం చేసింది. దర్యాప్తు నత్తనడకన సాగడంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ వేగవంతంగా చేస్తారా లేదా మమ్మల్ని ఉత్తర్వులు ఇమ్మంటారా అని ప్రశ్నించింది. అనంతరం కేసు విచారణను నవంబర్ 8కి వాయిదా వేసింది.