కరోనా ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. కొవిడ్ కాటుకు ఆ కుటుంబ పెద్ద కన్నుమూశారు. భర్త లేని బాధతో ఆ ఇల్లాలు ఆత్మహత్యాయత్నం చేసింది. కట్టుకున్నవాడి మరణంతో జీవితం అంధకారం అయ్యిందని బాధపడుతున్న సమయంలో నేనున్నా అంటూ ఆమె చేయిపట్టుకున్నాడు. ఏడడుగులు నడిచే వరకు ఆ చేయిని వదల్లేదు. ఆయన ఎవరో కాదు. కొవిడ్‌తో చనిపోయిన ఆ ఇంటి పెద్దకు ప్రాణ మిత్రుడు.
మిత్రుడు మరణంతోనే ఆ కుటుంబాన్ని వదులుకోక.. ఇంటిపెద్దగా మారి అందరి ఆశీర్వాదంతో స్నేహితుని భార్యను పెళ్లి చేసుకుని అండగా నిలబడ్డాడు.
ఏం జరిగిందంటే..?
కర్ణాటక చామరాజ్‌నగర్‌లోని ముల్లూర్ గ్రామానికి చెంది చేతన్ కుమార్‌కు, గుల్బర్గా జిల్లాలోని హనూర్కు చెందిన అంబికకు 8 ఏళ్ల కిందట వివాహం అయ్యింది. చేతన్ బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. అయితే కొవిడ్ రెండో వేవ్ సమయంలో చేతన్ కరోనా సోకి చనిపోయాడు. దీంతో అతని భార్య అంబిక.. భర్త మరణాన్ని జీర్ణించుకోలేక అత్మహత్యాయత్నం చేసింది. ఈ సమయంలో చేతన్ ప్రాణస్నేహితుడైన లోకేశ్ ఆమెను ఓదార్చాడు. ఎలాగైనా అంబికకు అండగా నిలవాలనుకున్నాడు.
అనంతరం చేతన్, అంబిక కుటుంబ సభ్యులతో మాట్లాడి.. ఇరు కుటుంబాల సమ్మతితో ఆమెను జనవరి 27న పెళ్లి చేసుకున్నాడు. చామరాజనగర్‌లోని శివయోగి మఠం వీరి వివాహానికి వేదికైంది.
ఇదీ చూడండి: కరోనాతో భర్త మృతి.. మరిదితో మహిళ వివాహం