వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టిన రైతన్నలు తమ నిరసనలను బురారీ మైదానానికి తరలించాలని కేంద్రం మరోసారి విజ్ఞప్తి చేసింది. కేంద్రం నిర్దేశించిన ప్రాంతానికి నిరసనలు తరలిస్తే వెంటనే కేంద్రమంత్రులతో కూడిన అత్యున్నత స్థాయి బృందం అన్నదాతలతో చర్చలు జరుపుతుందని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా తెలిపారు. ఈ మేరకు అయన శనివారం 32 రైతు సంఘాలకు లేఖలు పంపారు. చలి, కొవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు తమ ఆందోళనలను బురారీలోని నిరంకారీ మైదానానికి మార్చుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. అక్కడ రైతుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
జాతీయ రహదారులలో నిరసనలు చేయటం వలన ప్రజల రాకపోకలకు, సాధారణ జీవితానికి ఇబ్బందులు తలెత్తుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. బోర్డర్ పాయింట్ల వద్ద కాకుండా ప్రభుత్వం నిర్దేశించిన ప్రాంతానికి నిరసనలను తరలిస్తే ఆ మరుసటి రోజే కేంద్రమంత్రులతో కూడిన అత్యున్నత స్థాయి బృందం అన్నదాతలతో చర్చిస్తుందని పేర్కొన్నారు.