మాతృభాషకు వివిధ రంగాల్లో విస్తృత ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఆగస్టు 29న తెలుగు భాషావేత్త గిడుగు వేంకట రామమూర్తి జయంతి, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 'మన భాష, మన సమాజం, మన సంస్కృతి' అనే వెబ్‌నార్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా మాతృభాషలో బోధన వల్ల విద్యార్థులకు సబ్జెక్టులపై మంచి పట్టు లభిస్తుందని ఉద్ఘాటించారు. మిగతా భాషల కన్నా వేగంగా, ఎక్కువగా జ్ఞాన సముపార్జన మాతృభాషలోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రసంగించిన వెంకయ్య నాయుడు.. సంస్కృతి, సమాజ అభివృద్ధికి పునాదులు వేసేది భాషేనని నొక్కి చెప్పారు. తెలుగు భాషను పరిరక్షించాల్సిన అవసరం ఉందని చెప్పిన ఆయన.. భాష, సంస్కృతిని పెంపొందించడానికి తెలుగు ప్రజలంతా తప్పక కృషి చేయాలన్నారు. తెలుగుభాషను సరళమైన శాస్త్రీయ పరిభాషగా అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. ఇదే సామాన్య ప్రజలకు శాస్త్ర, సాంకేతికత రంగంలో మంచి అవగాహన కల్పించడంలో సహాయపడుతుందని తెలిపారు ఉపరాష్ట్రపతి.
మనం ఇచ్చే బహుమతి అదే...
అమృతం లాంటి మాతృభాష మాధుర్యం, వారసత్వాన్ని రాబోయే తరాలకు అందించడం ద్వారా మాత్రమే.. భాషను రక్షించి, సంరక్షించవచ్చని వెంకయ్య పేర్కొన్నారు. ప్రపంచీకరణ వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక స్థానిక భాషలు తమ ఉనికి కోల్పోతున్నాయని అన్నారు. ఇదే ధోరణి కొనసాగితే భాష అంతరించిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు.
''ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, జపాన్, చైనా వంటి దేశాలు ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో సమర్థవంతంగా పోటీపడుతున్నాయి. అయినప్పటికీ వారు అన్ని రంగాలలో తమ మాతృభాషలకే ప్రాధాన్యత ఇస్తున్నారని'' ఉపరాష్ట్రపతి వెంకయ్య పేర్కొన్నారు.