కరోనా కారణంగా ప్రస్తుత విద్యావిధానం ఆన్లైన్ ద్వారానే కొనసాగుతోంది. అయితే మొబైల్ గేమ్స్ అనగానే సంబరపడిపోయే పిల్లలు.. ఈ ఆన్లైన్ తరగతుల పేరిట ఫోన్లను మరో విధంగా ఉపయోగిస్తూ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనే ఒడిశాలోని కియోంజర్‌లో జరిగింది.
'ఫ్రీ ఫైర్' కోసం లక్ష ఖర్చు
జోడా పారిశ్రామిక నగరంలోని కమర్జోడా మురికివాడకు చెందిన వినోద్ అపాట్ అనే వ్యక్తి కొడుకు అమితాన్షు అపాట్(14).. సరస్వతి శిశు మందిర్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. ఆన్లైన్ తరగతుల కోసం తన తండ్రి అతనికి రూ.13,000తో ఓ ఫోన్ కొనిచ్చాడు.
తరగతులకు హాజరవుతూనే చరవాణిని మరో విధంగా ఉపయోగించిన అమితాన్షు 'ఫ్రీ ఫైర్' గేమ్‌కు అలవాటయ్యాడు. ముందుగా తన తండ్రి అకౌంట్ నుంచి.. గేమ్‌లో ఉండే కొత్త ఫీచర్ల కోసం రూ. 35,000 కట్టాడు. తర్వాత తన తల్లి బ్యాంక్ ఖాతా నుంచి రూ. 61,000 దాకా గేమ్ కోసం ఖర్చు చేశాడు.
మరణమే శరణం అనుకుని
ఈ విషయం తెలిశాక తండ్రి తనను ఏమంటాడో అని భావించిన అమితాన్షు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం తన తల్లి చీరతో బాత్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.