71వ గణతంత్ర వేడుకలకు యావత్ భారతం సిద్ధమైంది. దిల్లీలోని రాజ్‌పథ్ వద్ద ఆదివారం జరిగే వేడుకల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ మెస్సియాస్ బొల్సొనారో ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
త్రివిధ దళల కవాతు
దేశ సైనిక సత్తాను, ఆయుధ సంపత్తిని చాటుతూ త్రివిధ దళాలు కవాతు నిర్వహించనున్నాయి. దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తూ కళాకారులు ప్రదర్శన చేపట్టనున్నారు. తమ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ వివిధ రాష్ట్రాలు శకటాలను ప్రదర్శించనున్నాయి.
అమరులకు నివాళులు
వేడుకలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ... ఇండియా గేట్ వద్ద జాతీయ యుద్ధ స్మారక కేంద్రాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏటా ప్రధానులు అమర జవాన్ జ్యోతి వద్ద నివాళి అర్పిస్తుండగా... ఈ సారి తొలిసారిగా ప్రధాని మోదీ జాతీయ యుద్ధ స్మారక కేంద్రం వద్ద అంజలి ఘటించనున్నారు. అనంతరం మోదీ... రాజ్‌ఘాట్ చేరుకుని జాతిపిత మహాత్మాగాంధీకి నివాళి అర్పిస్తారు.
పటిష్ఠ బందోబస్తు
రాజ్‌పథ్ వద్ద జరిగే గణతంత్ర వేడుకలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. డ్రోన్ల నిఘాతోపాటు, 10 వేల మంది పోలీసులు, పారా మిలిటరీ సిబ్బందిని దిల్లీలో భద్రత కోసం మోహరించారు.
ట్రాఫిక్ ఆంక్షలు..
గణతంత్ర వేడుకల సందర్భంగా రాజధానిలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీని ప్రకారం రాజ్‌పథ్‌లో శనివారం రాత్రి 11 గంటల నుంచి రఫీ మార్గ్, జనపథ్, మాన్సింగ్ రోడ్ వద్ద రిపబ్లిక్ డే పరేడ్ ముగిసే వరకు వాహనాలను అనుమతించరు.
ఇండియా గేట్ చుట్టూ ఉన్న సీ-షడ్భుజిని జనవరి 26 తెల్లవారుజాము 2 గంటల నుంచి కవాతు ముగిసే వరకు మూసివేస్తారు. తిలక్‌మార్గ్, బహదూర్ షా జాఫర్ మార్గ్, నేతాజీ సుభాష్ రోడ్లలో ఉదయం 5 గంటల నుంచి కవాతు ముగిసే వరకు ట్రాఫిక్ అనుమతించరు. దిల్లీ మెట్రో రైలు సమయ పట్టికనూ పాక్షికంగా సవరించారు.
ఇదీ చూడండి: ఈటీవీ భారత్‌కు ఓటరు అవగాహన అవార్డు!