శాసనసభాపక్ష సమావేశం
కరోనా వేళ రాజస్థాన్‌లో రాజకీయ వేడి రాజుకుంది. డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ పార్టీ యువనేత సచిన్ పైలట్.. తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో దిల్లీకి చేరడం అశోక్ గహ్లోత్ ప్రభుత్వం సంకట స్థితిలో పడింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ శాసనసభాపక్షం సోమవారం ఉదయం 10.30 గంటలకు భేటీ కానుంది. సీఎం గహ్లోత్ నివాసంలో ఈ భేటీ జరగనుంది. తొలుత ఆదివారం రాత్రే ఈ సమావేశం నిర్వహించాలనుకున్నప్పటికీ వాయిదా పడింది. రాజస్థాన్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్లను రంగంలోకి దింపింది. ఆ పార్టీ నేతలు అజయ్ మాకెన్, రణ్‌దీప్ సూర్జేవాలా రేపు జరగబోయే శాసనసభా పక్ష సమావేశానికి హాజరుకానున్నారు.
ముదిరిన విభేదాలు?
రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా యత్నిస్తోందంటూ శనివారం అశోక్ గహ్లోత్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ కొంతమంది శాసనసభ సభ్యులతో కలిసి దిల్లీ వెళ్లడంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. ఇరువురి మధ్య తొలి నుంచి ఉన్న విభేదాలు గతకొంత కాలంగా తారస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన ఇటీవల పార్టీ అధిష్ఠానానికి కూడా వివరించినట్లు సమాచారం. కావాలనే గహ్లోత్ తనని దూరం పెడుతున్నారని అధినాయకత్వం ముందు వాపోయారట. ఈ పరిణామాల నేపథ్యంలో సచిన్ భాజపాకు సన్నిహితంగా మెలుగుతున్నట్లు కొంతమంది కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుండడం గమనార్హం.
ఆ నోటీసే కొంపముంచిందా..?
రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో సచిన్ పైలట్‌కు ఇటీవల స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్‌వోజీ) పోలీసుల నుంచి నోటీసులు అందినట్లు తెలుస్తోంది. దీనిపై జరుగుతున్న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసే సచిన్‌ను తీవ్ర అసంతృప్తికి గురిచేసినట్లు ఆయన మద్దతు వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ లేఖతో సచిన్ విషయంలో ముఖ్యమంత్రి తన పరిధి దాటి వ్యవహరించినట్లు వారంతా భావిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి వాతావరణంలో తాము గహ్లోత్ నాయకత్వంలో పనిచేసే పరిస్థితులు లేవని వారు తెగేసి చెబుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సచిన్ మద్దతు వర్గం గురుగ్రామ్‌లోని వివిధ రిసార్టులకు చేరినట్లు సమాచారం.
దీనిపై వివరణ ఇచ్చిన ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తనకు కూడా ఎస్‌వోజీ నుంచి నోటీసులు అందాయని తెలిపారు. ఈ నోటీసు వల్లే సచిన్ అసంతృప్తి గురయ్యారంటూ ప్రచారం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్రలు జరుగుతున్నాయంటూ ఎస్‌వోజీకి ఫిర్యాదులు అందాయి. ఈ విషయంలో ఇప్పటికే ఇద్దరు భాజపా నేతల్ని ఎస్‌వోజీ అరెస్టు చేసింది. ఈ క్రమంలోనే తాజాగా సీఎం, డిప్యూటీ సీఎంకు నోటీసులు అందినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన విచారణలో రాజ్యసభ ఎన్నిల సమయంలో ఇరు పార్టీలకు చెందిన పలువురు నేతల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు పోలీసులకు చిక్కినట్లు సమాచారం. వీటి ఆధారంగానే సచిన్‌కు నోటీసులు పంపినట్లు జైపుర్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
పైలట్ బలమెంత?
యువ నాయకుడు సచిన్ పైలట్‌కు 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలుస్తోంది. మరికొందరు స్వతంత్రులు సైతం ఆయనకు మద్దతిస్తున్నట్లు సమాచారం. సచిన్ పైలట్ తీసుకునే నిర్ణయం ఏదైనా అందుకు తాము సిద్ధంగా ఉన్నామని వారు చెబుతున్నారు. కరోనా సంక్షోభానికంటే ముందు నుంచే సచిన్ పైలట్ భాజపాతో టచ్‌లో ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే, సీఎం పదవి ఇచ్చేందుకు కాషాయ పార్టీ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సచిన్ సొంతంగా ప్రాంతీయ పార్టీ పెడతారన్న ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. రాజస్థాన్‌లో 200 స్థానాలకు గానూ కాంగ్రెస్‌కు 107 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. 12 మంది స్వతంత్రులు, మరో ఐదుగురు ఇతర పార్టీ సభ్యులు ప్రభుత్వానికి మద్దతిస్తున్నారు. వాస్తవంగా సచిన్ వెంట ఉన్నది ఎందరు? ప్రభుత్వం నిలుస్తుందా? వంటి ప్రశ్నలకు కొన్ని గంటల్లో సమాధానం రానుంది.