సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తమ సామాజిక మాధ్యమం దుర్వినియోగం అవకుండా ఫేస్బుక్ నియంత్రిస్తుందా అనే అంశంపై ఆందోళన వ్యక్తం చేసింది పార్లమెంటరీ కమిటీ.
భాజపా ఎంపీ అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలో సమాచార, సాంకేతికతపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎదుట ఫేస్బుక్ ప్రతినిధులు హాజరయ్యారు. ఎన్నికల్లో ఫేస్బుక్ దుర్వినియోగం అవుతుందన్న ఎంపీల వాదనలపై వివరణ ఇచ్చారు.
ఎన్నికల సమయంలో ప్రకటనలు ఇచ్చే వారి గుర్తింపు, స్థలం తెలుపుతూ ఓ ప్రత్యేక వెబ్‌పేజీని వినియోగదారులకు అందుబాటులో ఉంచుతామని ఐటీ పార్లమెంటరీ కమిటీకి ఫేస్బుక్ హామీ ఇచ్చింది. ఇప్పటివరకు జరిగిన పొరపాట్లకు ఫేస్బుక్ క్షమాపణ చెప్పినట్టు సమాచారం.
భారత్‌లో ఫేస్బుక్ ప్రకటనలను, అంశాలను, మార్కెటింగ్ కార్యాకలాపాలను నియంత్రించే వ్యవస్థపై కమిటీ అడిగిన ప్రశ్నలకు స్పష్టంగా సమాధానం చెప్పలేకపోయారు ప్రతినిధులు.
ఉగ్రవాదంపై ముఖ్యంగా ఇటీవలి పుల్వామా ఉగ్రదాడిపై కొందరు ఫేస్బుక్ ఉద్యోగులు చేసిన పోస్టులపై, ట్వీట్లపైనా వివరణ కోరారు కమిటీ సభ్యులు. వీటిపై క్షమాపణలు కోరారు ఫేస్బుక్ పబ్లిక్ పాలసీ ఉపాధ్యక్షుడు జోయోల్ కప్లన్. అయినా కమిటీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమాల్లో పౌరుల హక్కుల పరిరక్షణపై వాట్సప్, ఇన్స్టాగ్రామ్ ప్రతినిధుల వివరణను త్వరలో విననుంది 31 మంది సభ్యులతో కూడిన పార్లమెంటరీ కమిటీ.