కష్ట సమయంలో భారత్ తమకు అండగా నిలిచిందని, కరోనా వైరస్ నియంత్రణకు తోడ్పడిందని చైనా శ్లాఘించింది. మహమ్మారిని కట్టడి చేయడంలో తమ అనుభవాలను, చేపట్టిన చర్యలను ఆ దేశంతో పంచుకుంటామంది. వుహాన్ కేంద్రంగా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభించిన క్రమంలో... మాస్కులు, చేతి తొడుగులు, అత్యవసర ఔషధాలు, వైద్య పరికరాలు వంటి 15 టన్నుల సాధనాలను భారత్ గతనెల ప్రత్యేక సైనిక విమానంలో అక్కడకు చేరవేసింది. చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి జంగ్ షుయాంగ్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని గుర్తుచేశారు.
వైరస్ నియంత్రణలో తమకు సహాయం అందించిన 19 దేశాలకు ప్రతిసాయం చేయనున్నట్టు తెలిపారు. తాము కష్టంలో ఉన్నప్పుడు ప్రధాని మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లు లేఖలు, ఫోన్ సంభాషణల ద్వారా మద్దతు తెలిపారని షుయాంగ్ పేర్కొన్నారు. చైనాలో ఉన్న భారతీయుల ఆరోగ్య పరిరక్షణకు, భద్రతకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. కొవిడ్-19 నియంత్రణ విషయమై భారత్ సహా దక్షిణాసియా, యూరాసియా దేశాల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించామని, ఇందులో సుమారు 2 వేల మంది పాల్గొన్నారని ఆయన తెలిపారు.
ఇదీ చూడండి : పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ సుంకం పెంపుపై కాంగ్రెస్ ఫైర్