ఆదాయపు పన్నుశాఖ దేశవ్యాప్తంగా నిర్వహించిన సోదాల్లో పెద్ద ఎత్తున హవాలా సొమ్ము బయటపడింది. దేశ రాజధాని దిల్లీతో పాటు ముంబయి, హైదరాబాద్, పుణె, ఆగ్రా, గోవా నగరాల్లో 42 ప్రదేశాల్లో నిర్వహించిన దాడులు జరిపింది. ఈ ఆపరేషన్‌లో రూ. 3,300 కోట్ల హవాలా రాకెట్‌ను చేధించినట్లు ఐటీ అధికారులు వెల్లడించారు. బోగస్ బిల్లులు, హవాలా లావాదేవీలు జరుపుతున్న వ్యక్తులపై నిఘా వేసిన ఆదాయ పన్ను శాఖ..ఈ నెల మొదటి వారంలో దాడులు నిర్వహించింది. హవాలా నిర్వాహకులకు, మౌలిక సదుపాయాల రంగంలోని పెద్దవ్యాపారులతో భాగస్వామ్య సంబంధాలు ఉన్నాయని ధ్రువీకరించింది ఐటీశాఖ.
"సోదాలు విజయవంతంగా పూర్తయ్యాయి. పలు పెద్ద వ్యాపార సంస్థలు, హవాలా నిర్వాహకుల మధ్య సంబంధాలను ధ్రువీకరించే ఆధారాలు మా తనిఖీల్లో బయటపడ్డాయి."
-తనిఖీల అనంతరం ఆదాయపన్నుశాఖ ప్రకటన
నిధుల మళ్లింపులో పాల్గొన్న కంపెనీలు ఎక్కువగా దేశ రాజధాని ప్రాంతం మరియు ముంబైలో ఉన్నట్లు తెలిపింది. ఈ అవకతవకలు ప్రధానంగా మౌలిక సదుపాయాలు, దక్షిణ భారతదేశంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం కేటాయించిన ప్రాజెక్టుల్లో చోటుచేసుకున్నట్లు వెల్లడించారు.
ఈ దర్యాప్తులో ఆంధ్రప్రదేశ్‌లోని ఒక ప్రముఖ వ్యక్తికి 150 కోట్ల రూపాయలకు పైగా నగదు చెల్లించినట్లు ఆధారాలు లభించాయని సీబీడీటీ తెలిపింది. అదే సమయంలో నిందితుల నుంచి 4 కోట్ల 19 లక్షల నగదు, 3 కోట్ల 20 లక్షలకు పైగా విలువచేసే ఆభరణాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి: 'మహా' ప్రతిష్టంభన: సేనకు చిక్కని పీఠం-ఎన్సీపీకి ఆహ్వానం!