ప్రశ్న: గంభీర్.. మొట్టమొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న మీపై వివాదాల రూపంలో ప్రతిపక్షాలు దాడులు చేస్తున్నాయి. మీ సమాధానం?
జవాబు: భాజపాలో చేరినప్పటినుంచి వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. నేను రాజకీయాలకు కొత్త. వివాదాలకు ఎలా సమాధానమివ్వాలో త్వరగా తేల్చుకోలేకపోతున్నాను. ముందుగా చివరిరోజు నామినేషన్ వేయడం వల్ల సాంకేతిక సమస్య తలెత్తింది. తర్వాత రెండు ఓటరు కార్డుల వివాదం చుట్టుముట్టింది. అనంతరం అనుమతులు లేకుండా సమావేశం నిర్వహించారన్న వివాదం. వీటిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంటున్నాను. నాకు రాజేందర్‌నగర్‌లో మాత్రమే ఓటు ఉంది. కరోల్‌బాగ్‌లోని రంజాస్ రోడ్డులో అమ్మమ్మ వాళ్లింట్లో ఉండేవాడిని. అక్కడ ఓటు ఎలా వచ్చిందో తెలియదు.
ప్రశ్న: ఆట నియమాలు తెలియనివారు ఆడరాదంటూ ఆప్ తరఫున మీపై పోటీ చేస్తున్న ఆతిషీ వ్యాఖ్యానించడంపై మీ సమాధానం?
జవాబు: సరైన సంకల్పం, నిష్కళంక హృదయం...ఇవే రాజకీయాలకు నిబంధన అని నేను అనుకుంటున్నాను. నా ప్రత్యర్థులు ఏ నిబంధనల గురించి మాట్లాడుతున్నారో తెలియదు.
ప్రశ్న: రాజకీయాల్లో రాణిస్తారనుకుంటున్నారా?
జవాబు: రాజకీయాలు నల్లేరుపై నడకేమీ కాదు. క్రికెట్లోనూ ఎన్నో సవాళ్లను ఎదుర్కున్నాను. సవాళ్లు నాకు స్ఫూర్తినిస్తాయి. నాలోని లోపలి మనిషిని తట్టిలేపుతాయి. నేను నా రాజకీయ ప్రసంగాల్లో సానుకూల రాజకీయాలే చేస్తామని చెబుతున్నాను. ప్రజలకు అభివృద్ధి ఫలాల్ని అందించడమే లక్ష్యం.
ప్రశ్న: మీ నియోజకవర్గంపై మీ ప్రణాళికలు ఏవిధంగా ఉన్నాయి?
జవాబు: నేను దిల్లీని లండన్, పారిస్ చేస్తానని చెప్పట్లేదు. రాబోయే తరాలకు కాలుష్య రహిత వాయువు, నాణ్యమైన నీరు అందించడమే లక్ష్యం. అబద్ధపు హామిలివ్వడం కన్నా కనీస అవసరాల్ని గుర్తించి తీర్చడం మంచిది. క్రికెట్లో మా ఆటతో ప్రేక్షకుల్ని ఆనందపరచాలి. కానీ రాజకీయాల్లో అలాకాదు. వారి పరిస్థితులను పూర్తిగా మార్చాలి.
ప్రశ్న: రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది?
జవాబు: నాకు రెండు అవకాశాలున్నాయి. ఒకటి ట్విట్టర్‌ను కట్టిపెట్టి దేశ రాజకీయాలపై కళ్లు మూసుకుని కూర్చోవడం. రెండు వాటికోసం ఏమైనా చేయడం. నేను రెండోది ఎంచుకున్నాను.
ప్రశ్న: రాజకీయాలు, క్రికెట్ ఏది బాగుందనిపిస్తోంది?
జవాబు: నేను రాజకీయాల్లోకి వచ్చి వారమే అయింది. ఇప్పుడు కామెంట్ చేయడం సరికాదు. రాజకీయాలు క్రికెట్‌కు భిన్నమైన సవాళ్లను మన ముందు ఉంచుతాయి.
ప్రశ్న: జాతీయ భద్రతను భాజపా ఎన్నికల అంశంగా చేసుకుందన్న విపక్షాల విమర్శలపై మీ సమాధానం?
జవాబు: జాతీయ భద్రత అత్యంత కీలక అంశం. ఇది ఎన్నికల అంశమెందుకు కాకూడదు? 70 ఏళ్ల చరిత్ర మనల్నిక్కడి వరకు తీసుకొచ్చింది. 26/11 తర్వాత అప్పటి ప్రభుత్వం సమర్థ నిర్ణయాలు తీసుకోలేదు. ఉరీ, పుల్వామా ఘటనల అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీ సాహసంతో నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రశ్న: మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి?
జవాబు: ప్రస్తుతం రాజకీయాలే ప్రాధాన్యాంశం. పదవులపై ఆసక్తి లేదు. ఉంటే గతేడాది దిల్లీ కెప్టెన్సీ వదులుకునేవాడిని కాదు.
ఇదీ చూడండి: భాజపాను బలపరిచిన శునకం.. అరెస్టు