సయ్యద్ అలీ షా గిలానీ. కశ్మీర్ వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్‌కు జీవితకాల అధ్యక్షుడు. ఇటీవల అకస్మాత్తుగా తన పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామం జమ్మూకశ్మీర్‌లోని వేర్పాటువాద కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు. హురియత్‌ను విడిచి పెడుతున్నట్లు ఆయన చేసిన ప్రకటన వాస్తవంగా రాజకీయాలను వదిలేయడానికి సమానంగా చెప్పుకోవాలి. అనారోగ్యంతో బాధపడుతున్న గిలానీ ప్రస్తుతం 90 ఏళ్ల పెద్ద వయసులో ఉండటంతో ఆయన రాజీనామాకు రాజకీయ క్షేత్రం నుంచి ప్రతిస్పందనలు అంతగా వ్యక్తం కాలేదనుకోవచ్ఛు మొత్తానికి ఈ పరిణామం కశ్మీర్‌లోని భద్రతా సంస్థలకు పెద్ద ఉపశమనం కలిగించినట్లయింది. ఎందుకంటే ఆయన హురియత్ అధినేత స్థానంలో ఉండి మరణించినట్లయితే, మరో అస్థిరతకు, శాంతిభద్రతల సమస్యకు దారితీసి ఉండేది.
గిలానీ తన రాజీనామా ద్వారా కశ్మీర్ ప్రజలతో నేరుగా సంబంధాలు నెరపుతున్న కేంద్రం స్థాయి అధికారుల పనిని సులభతరం చేశారు. బహుశా అందుకే కావచ్చు, జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడంలో కీలకంగా నిలిచిన వ్యక్తుల్లో ఒకరైన భాజపా సీనియర్ నేత రాంమాధవ్ సత్వరమే స్పందిస్తూ వరసగా ట్వీట్లు చేశారు. గిలానీ హురియత్ నుంచి రాజీనామా చేశారు అని పేర్కొంటూ ఆయన రాజీనామా లేఖను జత చేస్తూ మొదటి ట్వీట్ చేశారు. ‘కశ్మీర్ లోయను ఉగ్రవాదంలోకి, హింసలోకి నెట్టడం ద్వారా వేల మంది కశ్మీరీ యువత, కుటుంబాల జీవితాలు నాశనం కావడానికి ఏకైక కారణంగా నిలిచిన వ్యక్తి, ఎలాంటి కారణం చెప్పకుండానే రాజీనామా చేశారు. ఇది ఆయన పాత పాపాలన్నింటి నుంచి విముక్తి కలిగిస్తుందా?’ అంటూ రాంమాధవ్ తన మూడో ట్వీట్‌లో వ్యాఖ్యానించారు. ఏడాది కాలంగా నిశ్శబ్దంగా ఉండిపోయినా... గిలానీకి ఎంత ప్రాధాన్యం ఉందనేది తాజా పరిణామాలే సూచిస్తున్నాయి.
అధికరణం 370 రద్దు తర్వాత హురియత్ కాన్ఫరెన్స్‌గాని, గిలాని ప్రకటనలుగాని చాలా అరుదుగా సంక్షిప్త సందేశాల రూపంలో వెలువడ్డాయి. అంతేతప్పించి, జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు నిర్ణయాన్ని నిరసిస్తూ ఎలాంటి ఆందోళన కార్యక్రమాలకూ పిలుపు నివ్వలేదు. కశ్మీరులో, సరిహద్దుల వెంట డబ్బు, అధికారాల పంపిణీకి సంబంధించి హురియత్ సభ్యుల మధ్య గొడవలు, అంతర్గత కలహాలను వివరించే- గిలానీ రాజీనామా లేఖ శ్రవణ సందేశం రూపంలో ప్రజలను చేరింది. ఇది వెంటనే విస్తృతంగా వ్యాప్తి చెంది ప్రాంతీయ, జాతీయ స్థాయిలో పతాక శీర్శికలకు ఎక్కింది.
లేఖతో స్పష్టం..
గిలానీ ఆధ్వర్యంలోని హురియత్ చీలిక కూటమి వేర్పాటువాద డిమాండ్‌ను పూర్తిగా వదిలేసిందని, అదిప్పుడు లేవనెత్తాల్సిన అంశమే కాదని తీర్మానించేసినట్లుగా ఆయన లేఖ స్పష్టంగా సూచిస్తోంది. హురియత్‌లో ఇతరులెవ్వరూ తనకు సమాన స్థాయిలో నిలిచేందుకూ ఇష్టపడలేదు. హురియత్‌లో తన వారసుడిగా పెద్ద కుమారుడు డాక్టర్ నయీంను నామినేట్ చేస్తూ న్యాయపరంగా వీలునామాను రూపొందించినట్లు ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈ పరిణామం మొత్తం వేర్పాటువాద శిబిరంలో అలజడికీ, గందరగోళానికి దారితీసింది. తదనంతర పరిణామాల్లో సదరు వీలునామాను గిలానీ బలవంతంగా ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.
ఒకప్పుడు గిలానీ అనుభవించిన ప్రజాదరణలో పెద్దగా ఇక్కట్లు లేవు. ముప్పు కూడా తక్కువే. కానీ, ఇప్పుడు పరిస్థితి అలా లేదు. వేర్పాటువాద డిమాండ్ లేవనెత్తితే ప్రభుత్వం గట్టిగా స్పందించే అవకాశం ఉంది. ముఖ్యంగా అధికరణం 370 రద్దయిన తదనంతర తర్వాత పరిస్థితులు బాగా మారాయని చెప్పకతప్పదు. గిలానీది ఎల్లప్పుడూ ప్రభుత్వ వ్యతిరేక గొంతుకే. రాజీ పడని వైఖరి అతనిని ఇతర వేర్పాటువాద నేతల నుంచి ప్రత్యేక స్థానంలో నిలిపింది. 2003లో గిలానీ అసలైన హురియత్ నుంచి వైదొలగి, వేరుకుంపటి పెట్టినప్పుడు... భారత్, పాకిస్థాన్‌లతో చర్చల్లో పాల్గొనేందుకు నాయకత్వం అమ్ముడుపోయిందంటూ ఆరోపణలు గుప్పించారు. తన వర్గంతో మరో హురియత్ సంస్థను ఏర్పాటు చేశారు. దీన్ని ఆయన పరిశుద్ధీకరణ ప్రక్రియగా అభివర్ణించారు.
గిలానీ రాజీనామా లేఖ పలు అంశాలు వెలుగులోకి రావడానికి దారి తీసినట్లయింది. ఈ క్రమంలో శ్రీనగర్ నుంచి ముజఫరాబాద్ వరకు ఆయన రాజీనామాపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 'ఏ వ్యకీ్తి తన సిద్ధాంతానికి, రాజకీయ దృక్పథానికి, నమ్మకానికి, విశ్వాసానికి రాజీనామా చేయలేరు' అంటూ గిలానీ మనవరాలు ట్వీట్ చేశారు. గిలానీని హురియత్ నుంచి బయటికి నెట్టేసేందుకు ప్రయత్నిస్తూ, దాదాపు విజయం సాధించిన శ్రేణులకు ఈ సందేశం ఒక సమాధానం కావచ్ఛు వారంతా కలిసి తనను బయటికి గెంటెయ్యకముందే గిలానీ గౌరవప్రదమైన నిష్క్రమణను కోరుకున్నారు. హురియత్‌ను విడిచిపెట్టారు.
- బిలాల్ భట్, కశ్మీరీ వ్యవహారాల నిపుణులు