అక్టోబర్ 2... ఈ ఏడాది ఎంతో ప్రత్యేకం. అందుకు కారణం... మహాత్మా గాంధీ 150వ జయంత్యుత్సవం కావడం. ఏడాది ముందు నుంచే ఉత్సవాలు ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. అయినా ఎక్కడో ఏదో నిరాశ. 72 ఏళ్లుగా గాంధీజీ ఆదర్శాలను విస్మరిస్తూ వస్తున్నామన్న బాధ. ఇలానే కొనసాగితే... భారత దేశ భవిష్యత్ ఏంటన్న ఆందోళన.
ప్రపంచీకరణ యుగం ఇది. దుబారా ఖర్చులు, విలాసవంతమైన జీవితం సర్వసాధారణమైపోయిన కాలం. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా గాంధేయవాదం గురించి మాట్లాడితే వింతగా చూస్తారు. అనాగరిక, మధ్య యుగం నాటి మనస్తత్వం ఉన్న వ్యక్తిగా ముద్ర వేస్తారు.
కానీ... దేశ జనాభాలో సగానికిపైగా ఉన్న యువత ఆలోచన మాత్రం అలా లేదు. మహాత్ముడి సిద్ధాంతాల గురించి వారు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. గాంధీ ఆదర్శాలు, విలువలు ప్రస్తుత కాలానికి ఏ విధంగా సరిపోతాయో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు.
సృజన, కఠోర పరిశ్రమతో లక్ష్యాలు త్వరగా సాధించాలని ప్రస్తుత యువత పరితపిస్తూ ఉండొచ్చు. కానీ... మన సంస్కృతి మూలాలను, వ్యవస్థ మౌలిక విలువల పట్ల అవగాహన పెంచుకునే సామర్థ్యం వారికి ఉంది. అప్పుడే ఏమైనా దిద్దుబాటు చర్యలు అవసరమైతే సత్వరమే చేపట్టవచ్చని వారికి తెలుసు. ఐన్‌స్టీన్ వంటి శాస్త్రవేత్తలు, రస్సెల్ వంటి తత్వవేత్తలు, బెర్నార్డ్ షా వంటి సాహితీ దిగ్గజాలు, నోబెల్ పురస్కార గ్రహీతలు... బాపూజీని ఓ మార్గదర్శిగా చూశారని తెలుసుకునేందుకు ప్రస్తుత యువ తరం ఎంతో గర్వపడుతుంది.
మహాత్ముడు పేదల కోసమే బతికారు. తన జీవితాన్ని మానవాళి సంక్షేమం కోసమే అంకితమిచ్చారు. రాజ్‌మోహన్ గాంధీ రాసిన "మోహన్‌దాస్" పుస్తకంలో అరబ్ కవి మిఖైల్ నొయేమా రాసిన ఓ కవిత ఉంటుంది. అది బాపూ ప్రస్థానానికి అద్దం పడుతుంది.
"గాంధీ చేతిలోని రాట్నం కదురు... ఖడ్గం కన్నా శక్తిమంతమైంది. గాంధీ శరీరంపై ఉండే పల్చటి వస్త్రం అత్యంత దృఢమైన రక్షణ కవచం. గాంధీ దగ్గర ఉండే మేక... బ్రిటిష్ సింహంకన్నా బలమైనది."
-మిఖైల్ కవిత సారాంశం
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 7 దశాబ్దాలు దాటిన తర్వాత ప్రతి యువకుడు, యువతి మదిలో ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. మహాత్ముడు, ఇతర మహా నేతలు పోరాడింది ఈ స్వాతంత్ర్యం కోసమేనా? ఏటా అక్టోబర్ 2, జనవరి 30న దిల్లీ రాజ్‌ఘాట్ వద్ద కూర్చుని మన నేతలు ఏమని ప్రార్థిస్తారు? గాంధీ దృష్టిలో స్వరాజ్యం అంటే? స్వతంత్ర భారతం ఇప్పటివరకు సాధించిన విజయాలను చూసి జాతిపిత నిజంగా సంతోషిస్తారా? ఈ ప్రశ్నలు అన్నింటికీ సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉంది.
గాంధీజీ దృష్టిలో స్వరాజ్యం అంటే బడుగు, బలహీన వర్గాలను సాధికారుల్ని చేయడం. కానీ... 1947 ఆగస్టు 15 నాటి జనాభా(33 కోట్లు)తో సమానమైన సంఖ్యలో ప్రజలు ప్రస్తుతం దారిద్ర్య రేఖకు దిగువన ఉండడం బాధాకరం. కానీ... నిజం.
గాంధీజీ దృష్టిలో స్వతంత్రం అంటే... స్వీయ పరిపాలన, స్వీయ క్రమశిక్షణ. దురాశ, స్వార్థం కాదు. 1893 మేలో దక్షిణాఫ్రికాలో పీటర్‌మారిట్జ్‌బర్గ్ రైల్వేస్టేషన్లో అవమానానికి గురైన రాత్రి నుంచి... 1948 జనవరి 30న హత్యకు గురైన నాటి వరకు... బాపూ జీవితం అంతా హింస, స్వార్థం, అన్యాయం, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడారు. మానవ చరిత్రలో గాంధీ ఎదుర్కొన్నన్ని ఇబ్బందులు, చేసిన త్యాగాలు... మరెవ్వరూ చేసి ఉండరు. అంతటి మహనీయుడి జీవిత విశేషాలను, ఆయన ఆదర్శాలను భావి తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.
(రచయిత- ఆచార్య ఎ. ప్రసన్న కుమార్)