ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బంగాల్ రాష్ట్రాలను వణికిస్తోంది ఫొని తుపాను. ముందుకు కదులుతున్న కొద్దీ ఉగ్రరూపం దాలుస్తూ అతితీవ్ర తుపానుగా మారింది. ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి గంటకు 21 కిలో మీటర్ల వేగంతో ఉత్తర ఈశాన్య దిశగా కదులుతోంది. ఒడిశాలోని పూరికి నైరుతి వైపు 760 కిలోమీటర్ల దూరంలో ఫొని తుపాను కేంద్రీకృతమైంది.
తుపాను వల్ల పెనుగాలులు...
ఫొని తుపాను కారణంగా తీరప్రాంతాల్లో పెనుగాలులు వీచే అవకాశం ఉంది. మే 3వ తేదీ మధ్యాహ్నానికి ఒడిశా రాష్ట్రంలోని చాంద్‌బలి-గోపాల్పూర్ మధ్య తీరం దాటుతుందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో దాదాపు0 205 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశముంది.
నాలుగు రాష్ట్రాలపై ప్రభావం
ఫొని అతి తీవ్ర తుపాను ప్రభావం ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై అధికంగా ఉండే అవకాశం ఉంది. బంగాల్, ఉత్తర తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తీర ప్రాంతాలు అప్రమత్తం
ఒడిశా తీర ప్రాంత జిల్లాలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇప్పటికే తుపాను హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులను సముద్రానికి దూరంగా ఉండాలంటూ సూచనలిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుపానును ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపడుతోంది. తుపాను దృష్ట్యా ఒడిశా, కోసాంధ్ర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి.
కేంద్రం అప్రమత్తం... రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్
ఫొని తుపానును ఎదుర్కోవడానికి కేంద్రం తగిన చర్యలు చేపట్టింది. నావికా దళం, తీరప్రాంత రక్షణ దళ నౌకలు, హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీర ప్రాంతాలకు చేరుకుంటున్నాయి. అవసరమైతే సైన్యం, వాయుసేన సహాయాన్ని తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. నౌకల్లో సహాయక సామాగ్రిని ఏర్పాటు చేశారు అధికారులు. ప్రజలకు అవసరానికి సరిపడా ఆహార పదార్థాలు, దుస్తులు, ఔషధాలు, దుప్పట్లు తదితరాలను సిద్ధం చేసినట్టు తెలిపారు.
ఇదీ చూడండి: పెళ్లి కంటే 'పబ్జీ' యే ముఖ్యం.. !