సీతాకోకచిలుకలంటే అందరికీ ఇష్టమే. రంగురంగుల సీతాకోకచిలుకలు ఎగురుతూ ఉంటే చూసి మురిసిపోతాం. కానీ వాటి పరిరక్షణకు ఎంతమంది పాటు పడతారు అంటే... సమాధానం చెప్పడం కష్టమే. అయితే కేరళ పాలక్కాడ్‌లోని కరాల్మన్నా ప్రాంతానికి చెందిన అచ్యుతానందన్ అనే ఉపాధ్యాయుడు తన ఇంటి పెరడును.. సీతాకోకచిలుకల ఉద్యానంగా మార్చారు. సీతాకోకచిలుకల పరిరక్షణ, సంతానోత్పత్తిని పెంచే ఉద్దేశంతో ఈ విధంగా చేసినట్లు ఆయన తెలిపారు. వాటికి అత్యంత ఇష్టమైన గిలక్కాయ మొక్కలను ఇంటి పెరడులో నాటారు. ఫలితంగా 500 రకాలకు పైగా సీతాకోకచిలుకలు పెరట్లోకి వచ్చి వాలుతున్నాయి.
కరినీల కదువా..
ముఖ్యంగా నలుపు, ముదురు నీలం రంగు మచ్చలున్న నీలగిరి టైగర్ రకానికి చెందిన సీతాకోకచిలుకలు జులై- అక్టోబరు మధ్య కాలంలో అక్కడ కనువిందు చేస్తాయి. వీటిని స్థానికంగా 'కరినీల కదువా' అని పిలుస్తారు. అవి ఎగురుతున్నప్పుడు చూస్తుంటే మనసు పులకరించిపోతుంది.
"పర్యావరణ సుస్థిరతకు సీతాకోకచిలుకలు చాలా కీలకం. సీతాకోకచిలుకలు లేకపోతే మొక్కల్లో పరాగసంపర్కం జరగదు. దీని వల్ల మనం తినడానికి కూరగాయలు, పండ్లు దొరకవు. నా కుమారుడు బద్రీనాథ్, నేను మొక్కలను, సీతాకోకచిలుకలను జాగ్రత్తగా చూసుకుంటున్నాం. ఆ రంగురంగుల చిలుకలు ఎగురుతున్నప్పుడు పొందే ఆనందం మాటల్లో చెప్పలేనిది."
- అచ్యుతానందన్, ఉపాధ్యాయుడు
ఇదీ చూడండి: సహజసిద్ధమైన ఆహారానికి కేరాఫ్ అడ్రస్ 'భారతీపురం'