ఉగ్రవాదం వైపు యువత అడుగులు వేయకుండా నిరోధించడానికి 'అన్వేషణ - సంప్రదిం పులు' అనే కొత్త విధానాన్ని భారత సైన్యం ఎంచుకొంది. ఈ విధానంలో భాగంగా.. ఉగ్రవాద సంస్థల్లో చేరిన, ఎన్‌కౌంటర్లలో మరణించిన వారి స్నేహితులు, బంధువులను కనుగొని, ఆవేశపూరిత నిర్ణయాలతో ఉగ్రవాదులుగా మారొద్దని నచ్చచెబుతారు. ఉగ్రవాదానికి ఆకర్షితులయ్యే అవకాశమున్న యువకుల కుటుంబాలను సైతం చైతన్యపరిచే కార్యక్రమాలు చేపడతారు.
ఈ విషయంపై లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు మాట్లాడుతూ "సరైన సమయంలో అవగాహన కల్పిస్తే తప్పటడుగులు వేయకుండా యువతను కాపాడవచ్చు. భారత సైన్యం ఎప్పుడూ ఉగ్రవాద హవసను సమూలంగా నివారించడానికి ప్రయత్నిస్తుంది. దక్షిణ కశ్మీర్‌లో జరిగిన ఎన్కౌంటర్లు, ఉగ్రవాద సంస్థల్లో యువకుల నియామకాల గురించి భారత సైన్యం విశ్లేషించింది. అక్కడ జరిగిన ఎన్‌కౌంటర్లలో ఎవరైనా మృతి చెందారా? అనే విషయంపై 'అన్వేషణ-సంప్రదింపులు' కార్యక్రమాన్ని ఇప్పటికే అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది ఆచరణలో పెట్టారు. ఈ విధానం సత్ఫలితాలనిచ్చింది. చాలా మంది యువకులు ఉగ్రవాదాన్ని వీడారు యువతలో తుపాకీ పట్టాలనే ఆలోచనను మట్టుబెట్టడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం" అన్నారు.