దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 2,31,902 కరోనా పరీక్షలు జరిగినట్టు కేంద్రం తెలిపింది. 24 గంటల వ్యవధిలోనే 1,211 కేసులు వెలుగుచూశాయి. 31మంది మృతిచెందారు. ఇప్పటివరకు మొత్తం 10,363మందికి వైరస్ సోకగా.. మృతుల సంఖ్య 339కి చేరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన 7 సూత్రాలను కచ్చితంగా పాటించాలని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ స్పష్టం చేశారు. భౌతిక దూరం వందశాతం పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.
కరోనా బాధితులకు చికిత్స అందించడం కోసం ప్రత్యేకంగా 602 ఆసుపత్రులను కేటాయించినట్టు అగర్వాల్ వెల్లడించారు. వీటిల్లో 1,06,719 ఐసోలేషన్ పడకలు, 12వేల 024 ఐసీయూ బెడ్లు ఉన్నట్టు పేర్కొన్నారు. పరీక్షలు నిర్వహించడానికి 166 ప్రభుత్వ ల్యాబ్‌లతో పాటు మరో 70 ప్రైవేటు ల్యాబ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు అగర్వాల్. కరోనాకు సంబంధించి 20 గ్రీవెన్స్ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు వివరించారు.
28రోజులు...
ఏదైనా ఒక నిర్దేశిత ప్రాంతంలో 28 రోజుల పాటు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోతే.. అప్పుడు ఆ ప్రాంతంలో వైరస్ వ్యాప్తి చైన్‌ను తెంచినట్లు అవుతుందని తెలిపారు లవ్ అగర్వాల్. వైరస్‌పై అన్ని జిల్లాలు, నగరాలు చేపట్టిన చర్యలను కేంద్రం ఈ నెల 20వరకు పరిశీలిస్తుందని.. దాని బట్టి ప్రత్యేక కార్యకలాపాలు సాగించడానికి అనుమతినిస్తుందని స్పష్టం చేశారు.
పేదలకు...
పేదలందరికీ ఉచితంగా ఆహారం అందిస్తామని కేంద్రం ప్రకటించింది. 80కోట్ల మందికి 5 కిలోల చొప్పున ఆహార వస్తువులు అందించనున్నట్టు తెలిపింది. ఇందుకోసం 22లక్షల టన్నుల ఆహారధాన్యాలు అందుబాటులో ఉన్నట్టు స్పష్టం చేసింది.
సోమవారం వరకు 32కోట్ల మందికిపైగా పేదలు.. కేంద్రం అందించిన రూ.29,352 కోట్ల ఆర్థిక సహాయాన్ని పొందినట్టు తెలిపింది.