పోక్సో చట్టం సవరణ బిల్లు-2019కి లోక్సభలో ఆమోదం లభించింది. చిన్నారులపై లైంగిక దాడులు, మైనర్లపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి మరణ శిక్ష విధించేలా ఈ బిల్లును రూపొందించారు. బిల్లుపై జరిగిన చర్చలో భాగంగా కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ భావోద్వేగంగా ప్రసంగించారు.
"ఈ బిల్లు ఓట్ల కోసం ప్రవేశపెట్టింది కాదు. ఎందుకంటే చిన్నారులు ఓట్లు వేయలేరు. భారత్ భవిష్యత్తును సురక్షిత గమ్యానికి చేర్చేందుకు సంబంధించిన బిల్లు ఇది. శిక్షాస్మృతి చట్టం-2018 సవరణ, ఇప్పుడు చేస్తున్న పోక్సో చట్టం సవరణలతో.. మైనర్లపై దాడికి పాల్పడితే మరణ శిక్ష విధించే అధికారం న్యాయమూర్తులకు ఈ సభ అందిస్తుంది."
-స్మృతి ఇరానీ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి
చిన్నారుల అశ్లీల సాహిత్యాన్ని ప్రచారం చేసే వారిని శిక్షించేందుకు ఈ చట్టం తోడ్పడుతుందని స్మృతి ఇరానీ పేర్కొన్నారు. లింగబేధం లేకుండా దేశంలోని 43 కోట్ల చిన్నారులకు పోక్సో సవరణ చట్టం రక్షణ కల్పిస్తుందని స్పష్టం చేశారు.
బిల్లుపై సలహాలు, సూచనలు
ఈ బిల్లు మరణశిక్షను ప్రస్తావిస్తున్నందున పలువురు ఎంపీలు కొన్ని సూచనలు చేశారు. తదుపరి పరిశీలన నిమిత్తం పార్లమెంటరీ కమిటీకి అప్పగించాల్సిందిగా కాంగ్రెస్ ఎంపీ ఒకరు సూచించారు. ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని డీఎంకే ఎంపీ కనిమొళి అభిప్రాయపడ్డారు.
చిన్నారులపై లైంగిక దాడుల కేసులను సత్వరమే పరిష్కరించేందుకు వీలుగా దేశవ్యాప్తంగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని జనతాదళ్(యునైటెడ్) నేత రాజీవ్ రంజన్ సింగ్ ప్రభుత్వానికి సూచించారు. శివసేన, బీఎస్పీ ఎంపీలు పోక్సో చట్టం సవరణ బిల్లుకు మద్దతు తెలిపారు.
ఇదీ చూడండి: కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికలపై కేపీసీసీ కసరత్తు