ఆజాం ఎంబ.. ఓరాన్ తెగకు చెందిన కురుఖ్ భాషలో ఈ పదానికి కమ్మటి భోజనం అని అర్థం. ఈ పేరుతో ఝార్ఖండ్ రాంచీలో ఉన్న ఓ స్లో ఫుడ్ రెస్టారెంట్.. అందుకు తగ్గట్టే ఆదివాసీల పద్ధతుల్లో సంప్రదాయంగా తయారుచేసిన భోజనం అందిస్తోంది.
"నేను ఓరాన్ తెగకు చెందినవాడిని. మా భాష కురుఖ్‌లోని ఓ పదాన్నే నా రెస్టారెంటుకు పేరుగా పెట్టుకున్నాను. అదే అజాం ఎంబా. అంటే కమ్మని ఆహారం అని అర్థం. ఝార్ఖండ్ సంప్రదాయ ఆహారం అందగా ఆదరణ పొందలేదు. దాన్ని నేను పొలం నుంచి పళ్లెంలోకి తెచ్చాను."
-అరుణ తిర్కే, అజాం ఎంబా డైరెక్టర్
అజాం ఎంబాకు వచ్చే వినియోగదారులకు దొరికే సాదర ఆహ్వానం.. మనసుల్లో ఉత్తేజం నింపుతుంది. తెగ సంప్రదాయం ప్రకారం.. ఓ చెంబుతో చేతులు కడుక్కుంటారు. తర్వాత ఇంట్లోలాగే ఓ చాపపై కూర్చోబెట్టి, భోజనం వడ్డిస్తారు. ప్రత్యేకత ఏమిటంటే.. బియ్యాన్ని స్వయంగా వీళ్లే దంచుతారు. మసాలాలు రోటిలో నూరుతారు. కట్టెల పొయ్యి మీద వంట చేస్తారు. ఇక్కడి భోజనం రుచిచూడాలంటే కొద్దిసేపు ఎదురుచూడాల్సి ఉంటుంది. కానీ, మట్టిపాత్రలు, రాగి చెంబులు, సంప్రదాయ భోజనం రుచి... ఎంతసేపైనా ఎదురుచూసేలా చేస్తుందనడం అతిశయోక్తి కాదు.
"దీనికో ప్రత్యేక గుర్తింపు ఉంది. రెస్టారెంట్ పేరు నుంచి, వెయిటర్స్ వేసుకునే దుస్తుల వరకు అన్నీ విభిన్నమే. ఆదివాసీల సంప్రదాయాలను బతికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది."
-సోనీ కుమారి, కస్టమర్
"ఇక్కడికొచ్చినప్పుడల్లా ఓ అతిథిలా చూస్తారు. మా సంప్రదాయం ప్రకారం చెంబుతో చేతులు కడుక్కొమ్మంటారు. దోనా-పత్రిలో భోజనం వడ్డిస్తారు. ఆహారం చాలా బాగుంటుంది."
-నీరజ్ కుమార్, వినియోగదారుడు
ఫాస్ట్‌ఫుడ్ కారణంగా ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని అంటున్నారు బిర్సా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆహార నిపుణులు డాక్టర్ రేఖా సిన్హా. దీన్ని అధిగమించాలంటే సంప్రదాయ ఆహారం, పద్ధతుల వైపు వెళ్లడం ఒక్కటే మార్గమని ఆమె చెబుతున్నారు.
అధికంగా రిఫైన్డ్ పిండితో తయారయ్యే ఫాస్ట్‌ఫుడ్‌లో కార్బొహైడ్రేట్లు తప్ప ఏం ఉండవు. అదే వివిధ రకాల ధాన్యంతో వండుకునే సంప్రదాయ భోజనంలో సమతులంగా ఉండి, పోషకాలు సక్రమంగా అందుతాయి.
-డా. రేఖా సిన్హా, ఆహార నిపుణులు
జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సర్వీస్‌లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత అరుణకు చాలా ఉద్యోగావకాశాలు వచ్చాయి. వైవిధ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ఆమె స్లోఫుడ్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం 8 మంది మహిళలకు పని కల్పించింది. ఆదివాసీ మహిళలు వెనకబడి ఉంటారన్న అపోహనూ పోగొట్టింది అరుణ.
"మాతో కలిసి 10 మంది పనిచేస్తున్నారు. వారిలో 8 మంది మహిళలు, ఇద్దరు పురుషులు. ఆదివాసీ మహిళల్లో వ్యాపారం చేసే నైపుణ్యాలు ఉండవని అందరూ అనుకుంటారు. అది అబద్ధమని నిరూపించాలనుకున్నాను."
-అరుణ తిర్కే, అజాం ఎంబా డైరెక్టర్
అజాం ఎంబాకు వారి తెగ సంస్కృతి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. రాంచీకి వచ్చే పర్యటకులు ఇక్కడి సంప్రదాయ రుచులను ఆస్వాదిస్తున్నారు.
ఇదీ చదవండి: పండుగ కాలంలో స్వీయ జాగ్రత్తలే రక్షా కవచాలు