నందిని... తమిళనాడు శివగంగై జిల్లాకు చెందిన న్యాయవాది. సామాన్య కుటుంబ నేపథ్యం. కానీ... ఆమె పేరు యావద్దేశం దృష్టిని ఆకర్షించింది. ఇందుకు కారణం... #ReleaseNandini హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ కావడమే. కోర్టు ధిక్కరణ కేసులో మదురై కేంద్ర కారాగారంలో ఉన్నారామె. వచ్చే వారం ఆమె వివాహం జరగాల్సి ఉంది. అందుకే... ఆమె విడుదలకు డిమాండ్ చేస్తూ ట్వీట్ల వర్షం కురిపించారు నెటిజన్లు.
ధిక్కరణతో...
నందిని, ఆమె తండ్రి ఆనందన్ తమిళనాడులో మద్యం నిషేధానికి 2012 నుంచి పోరాటం చేస్తున్నారు. పలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే టాస్మాక్ మద్యం దుకాణాలపై ఆందోళనలతో వారిపై 2014లో తిరుపత్తూర్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.
జూన్ 27న ఆ కేసు తిరుపత్తూర్ కోర్టులో విచారణకు వచ్చింది. వాదనలు వింటున్న సందర్భంలో భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 328 ప్రకారం మద్యం అమ్మటం తప్పుకాదా? అని న్యాయమూర్తిని ప్రశ్నించారు నందిని. ఈ వ్యాఖ్యలతో తండ్రితో పాటు ఆమెను కోర్టు ధిక్కరణ కింద జులై 9 వరకు శిక్ష అనుభవించాలని ఆదేశించారు న్యాయమూర్తి. ప్రస్తుతం ఇరువురు మదురై కేంద్ర కారాగారంలో ఉన్నారు.
నందిని వివాహం జులై 5న జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు నెటిజన్లను కదిలించింది. నందినికి సంఘీభావం తెలుపుతూ... ఆమెను విడుదల చేయాలనే హాష్‌ట్యాగ్‌తో ట్విట్ చేశారు.
ఇదీ చూడండి: వైరల్: విమానాన్ని ఢీకొట్టిన 'పక్షిరాజు'