కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులు.. చిరకాల మిత్రపక్షాలైన శిరోమణి అకాలీదళ్, భాజపా మధ్య అభిప్రాయబేధాలకు కారణమయ్యాయి. ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ అకాలీదళ్ ఎంపీ హర్సిమ్రత్ కౌర్ ఇప్పటికే తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
భాజపాతో పొత్తు కొనసాగించడం ముఖ్యమేనని, కానీ తమకు సొంత సిద్ధాంతాలు ఉన్నాయని శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ పేర్కొన్నారు. ఈటీవీ భారత్కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. తాము రైతుల పక్షాన నిలబడతామని అన్నారు. తమ ఆందోళనలకు పరిష్కారం లభించనప్పుడు కేబినెట్లో కొనసాగే అవసరం లేదని వ్యాఖ్యానించారు.
కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)పై కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ హామీ ఇచ్చినప్పటికీ.. బిల్లులను వ్యతిరేకించడంపై స్పష్టతనిచ్చారు సుఖ్బీర్.
"తోమర్ రాసిన లేఖను రైతులకు చూపించాం. లిఖితపూర్వక హామీకి రైతులు సంతృప్తి చెందలేదు. ఎంఎస్పీపై హామీని బిల్లులో చేర్చాలని వారు కోరారు. కేంద్రం ఆ పని చేయలేదు. అందుకే ప్రభుత్వంలో నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాం. తుది ముసాయిదా రూపొందించిన తర్వాత కూడా మమ్మల్ని సంప్రదించలేదు."
-సుఖ్బీర్ సింగ్ బాదల్, అకాలీదళ్ అధ్యక్షుడు
హర్సిమ్రత్ కౌర్ రాజీనామాపై పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ విమర్శలు చేయడాన్ని తప్పుబట్టారు సుఖ్బీర్. ఇలాంటి ఆర్డినెన్సులనే గతంలో అమరీందర్ ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు. వీటిని మేనిఫెస్టోలోనూ ప్రస్తావించిందని చెప్పారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లులో ముస్లింలను మినహాయించడాన్నీ తాము వ్యతిరేకించామని, అలాగే ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఇవన్నీ పార్టీ సిద్ధాంతాలని పేర్కొన్నారు.
రైతుల కోసం ఎంతటి త్యాగాలకైనా అకాలీదళ్ సిద్ధమని స్పష్టం చేశారు బాదల్. కూటమి విషయంపైనా పార్టీ కోర్ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.
ఇదీ చదవండి