తమిళనాడులోని కోయంబత్తూర్ పట్టణంలో ఉగ్రదాడి ప్రయత్నాలను భగ్నం చేశారు పోలీసులు. ముగ్గురు అనుమానిత ఇస్లామిక్ స్టేట్ సానుభూతిపరులను అరెస్ట్ చేశారు.
షాజహాన్, మహ్మద్ హుస్సేన్, షేక్ సఫియుల్లాహ్ అనే ముగ్గురు యువకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ ప్రకారం రద్దీగా ఉండే ఆలయాలు, చర్చిల వద్ద ఆత్మాహుతి దాడికి కుట్ర పన్నినట్లు తెలుస్తోంది.
ఇస్లామిక్ స్టేట్కు సంబంధించిన వీడియోలను తరుచుగా చూస్తున్నట్లు వచ్చిన పక్కా సమాచారం మేరకు వారిపై నిఘా పెట్టారు పోలీసులు. చట్ట వ్యతిరేక చర్యల నిరోధక చట్టం కింద ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
ఇటీవలే కోయంబత్తూర్లోని 7 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తనిఖీలు నిర్వహించింది. తమిళనాడులో ఇస్లామిక్ స్టేట్కు విభాగానికి సూత్రధారిగా అనుమానిస్తున్న మహ్మద్ అజారుద్దీన్ను అరెస్ట్ చేసింది. శ్రీలంకలో బాంబు దాడులకు సూత్రధారి అయిన జహ్రాన్ హషీమ్కు ఫేస్బుక్లో స్నేహితుడిగా ఉన్నాడు అజారుద్దీన్.
ఇదీ చూడండి: చెన్నైలో నీళ్లు కావాలంటే టోకెన్ తీసుకోవాల్సిందే!