భారత్- ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య జరిగిన సిరీస్ చివరి వన్డేలో పర్యటక బ్రిటీష్ జట్టే గెలిచింది. 206 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన ఇంగ్లీష్ జట్టు నామమాత్రమైన మూడో వన్డేలో నెగ్గి పరువు కాపాడుకుంది. డేనియల్లీ వ్యాట్ అర్ధశతకంతో కదం తొక్కగా, కెప్టెన్ హెథర్ నైట్ 47 పరుగులతో రాణించింది.
49 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను ఓటమి నుంచి తప్పించారు హెథర్, వ్యాట్లు. ఆరో వికెట్‌కు విలువైన 69 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును విజయతీరాలకు చేర్చారు. చివర్లో జార్జియా ఆచితూచి ఆడి ఇంగ్లండ్ విజయాన్ని ఖాయం చేసింది.
భారత స్టార్ బౌలర్ జులన్ గోస్వామి 3 వికెట్లతో ఆకట్టుకోగా, శిఖా పాండే రెండు వికెట్లు తీసింది. కేథరిన్ బ్రంట్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' గా నిలువగా స్మృతి మంధానా 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు దక్కించుకుంది.
మళ్లీ మంధాననే....
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన మిథాలీ సేన నిర్ణీత 50 ఓవర్లలో 205 పరుగులు చేసింది. నిలకడగా రాణిస్తున్న మంధాననే మళ్లీ భారత ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచింది. ఓపెనర్ స్మృతి మంధాన(66), పూనమ్(56) అర్ధశతకాలతో రాణించారు. మంధాన ఔటైన తర్వాత మిగతా బ్యాట్స్ఉమెన్ వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు.
ఇంగ్లాండ్ బౌలర్లలో కేథరిన బ్రంట్ ఐదు వికెట్లతో విజృంభించి విజయంలో కీలక పాత్ర పోషించింది. ఒకే ఓవర్లో స్మృతి మంధాన, పూనమ్ రౌత్‌లను ఔట్ చేసిన కేథరిన్ భారత టాప్ ఆర్డర్‌ని కుప్పకూల్చింది.