విశాఖపట్నంలో జరిగిన తొలి టీ20లో భారత్ ఓటమి పాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీంఇండియా పరుగులు సాధించడంలో తడబడింది. ఆసీస్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకుంది.
ఈ మైదానంలో భారత్‌కు ఘనమైన రికార్డే ఉంది. ఆడిన 10 అంతర్జాతీయ మ్యాచుల్లో 8 గెలిచింది. ఒకటి టై గా ముగిసింది.
బ్యాటింగ్
బలమైన బ్యాటింగ్ లైనప్‌తో బరిలోకి దిగిన టీంఇండియా పరుగులు సాధించడంలో ఇబ్బందిపడింది. రాహుల్ అర్ధశతకం సాధించి ఆకట్టుకున్నాడు. రాహుల్‌తో పాటు ధోని (29), కోహ్లీ (24) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. బ్యాట్స్‌మెన్ వైఫల్యం అనడం కంటే ఆసీస్ బౌలింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేసిందని చెప్పుకోవచ్చు. ఏ దశలోనూ భారత బ్యాట్స్‌మెన్‌కు అవకాశం ఇవ్వలేదు.
బౌలింగ్
127 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత బౌలర్లలో బుమ్రా, కృనాల్ ఆకట్టుకున్నారు. 19వ ఓవర్లో కేవలం రెండు పరుగులిచ్చి రెండు వికెట్లు తీసిన బుమ్రాను మెచ్చుకోకుండా ఉండలేం. చివరి ఓవర్లో 14 పరుగులు అవసరం కాగా ఉమేశ్ యాదవ్ దారుణంగా విఫలమయ్యాడు. మొదటి మ్యాచ్ ఆడిన మయాంక మార్కాండే ప్రభావం చూపలేకపోయాడు.
మిడిల్ ఆర్డర్ పరిస్థితేంటి?
ప్రపంచకప్ ముంగిట తుది జట్టు కోసం ప్రయత్నాలు చేస్తోన్న భారత్‌కు మిడిలార్డర్ పెద్ద సమస్యగా మారింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ తర్వాత వచ్చిన పంత్, కార్తీక్, కృనాల్ పాండ్యా ఏమాత్రం ప్రభావం చూపలేదు. వచ్చే మ్యాచులోనైనా ఈ విషయంపై జట్టు దృష్టి పెట్టాలని అంటున్నారు క్రికెట్ పండితులు.
ఆల్‌రౌండర్ల లేమి
హార్దిక్ పాండ్యా గాయంతో సిరీస్‌కు దూరమవగా కృనాల్ పాండ్యా ఆల్‌రౌండర్ బాధ్యతను తీసుకున్నాడు. బౌలింగ్‌లో కాస్త మెరుగైన ప్రదర్శన చేసినా బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. టీ20లో ఎంత ఎక్కువ మంది ఆల్ రౌండర్లు ఉంటే గెలిచే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. మరో మూడు నెలల్లో ప్రపంచకప్ మొదలు కాబోతోంది. కనుక భారత జట్టు తదుపరి మ్యాచ్‌లో పుంజుకోవాల్సిన అవసరం ఉంది.
ఇవీ చదవండి..ఉత్కంఠ పోరులో ఆసీస్ గెలుపు