ఐపీఎల్‌కి ఎంపిక కాలేదన్న కసో.. టీ20లకు పనికిరాడన్న విమర్శల ప్రభావమో కానీ... మొత్తానికి పూజారా తన బ్యాటును ఝులిపించాడు. తన శైలికి భిన్నంగా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. దేశవాళీ టీ-ట్వంటీ టోర్నీ .. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు.
టోర్నీలో సౌరాష్ట్ర తరపున బరిలోకి దిగిన చటేశ్వర్ పుజారా 61 బంతుల్లో శతకం బాది ఆశ్చర్యపరిచాడు. టీ20ల్లో అతనికిదే మొదటి శతకం. సౌరాష్ట్ర తరపున టీ-ట్వంటీలో సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.
గంటల కొద్ది క్రీజులో పాతుకుపోయి బౌలర్ల సహనాన్ని పరీక్షించే పుజారా... ఓపెనర్‌గా వచ్చి భారీ షాట్లు ఆడుతూ చివరి వరకు అజేయంగా నిలిచాడు. తన శైలికి భిన్నంగా దూకుడుగా ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.
శతకం చేసినా..
పూజారా శతకంతో మెరిసినా సౌరాష్ట్ర జట్టు మాత్రం రైల్వేస్ చేతిలో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర పుజారా సెంచరీతో 20 ఓవర్లలో 3 వికెట్లకు 188 పరుగులు సాధించింది. ఛేదనలో మృనాల్ (49), ప్రథమ్ సింగ్ (40), దీక్షిత్ (37) సమష్టిగా రాణించగా.. 5 వికెట్ల తేడాతో రైల్వేస్ విజయం సాధించింది.