ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో భారత్ మ్యాచ్ ఆడాలా, వద్దా అనేది బీసీసీఐ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. భారత క్రికెట్ బోర్డు నిర్ణయాన్ని శిరసావహిస్తామని స్పష్టం చేశాడు.
"పుల్వామా ఉగ్రఘటనలో చనిపోయిన జవాన్ల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఉగ్రదాడి దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనిపై విచారం వ్యక్తం చేస్తున్నాను. దేశం ఏది కోరుకుంటుందో, బీసీసీఐ ఏది నిర్ణయిస్తుందో దాని ప్రకారమే నడుచుకుంటాం. ప్రభుత్వం, బోర్డు నిర్ణయాన్ని మేము గౌరవిస్తాం. వారి మాటను శిరసావహిస్తాం" -- విరాట్ కోహ్లీ, భారత జట్టు కెప్టెన్.
ఫిబ్రవరి 14న జమ్ముకశ్మీర్ పుల్వామాలో ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు తమ ప్రాణాలను అర్పించారు. ఎంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఉగ్రచర్యను నిరసిస్తూ పాక్‌తో క్రికెట్ మ్యాచ్‌లు ఆడరాదని సర్వత్రా చర్చ జరుగుతోంది.
విశాఖలో ఆస్ట్రేలియాతోఆదివారం తొలి టీ 20 మ్యాచ్‌లో కోహ్లీసేన తలపడనుంది.