ఆదిలోనే రెండు వికెట్లు పోయినా..
127 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ప్రారంభంలోనే తడబడింది. ఐదు పరుగులకే స్టోయినిస్, ఫించ్ వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది ఆసీస్. అనంతరం క్రీజులోకి వచ్చిన మాక్స్ వెల్ ఓపెనర్ షాట్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. మాక్స్ వెల్ 43 బంతుల్లో 56 పరుగులు చేసి ఔటయ్యాడు.
- చివరి వరకు ఊగిసలాడిన విజయం:
కట్టుదిట్టమైన భారత బౌలింగ్ తో మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా సాగింది. చివరి రెండు ఓవర్లలో 16 పరుగులు చేయాల్సి ఉండగా 19వ ఓవర్లో బుమ్రా కేవలం రెండు పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. పదునైన యార్కర్లతో ఆసీస్ బ్యాట్స్ మెన్ ను ఇబ్బంది పెట్టాడు.
చివరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సి వచ్చింది. ఐదో బంతికి కమిన్స్ ఫోర్ కొట్టగా చివరి బంతికి రెండు పరుగులు అవసరం అయ్యాయి. చివరి బంతికి రెండు పరుగులు తీసి విజయం సాధించింది ఆసీస్.
భారత్ బౌలర్లలో బుమ్రా 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. చాహల్, పాండ్యా తలో వికెట్ తీసుకున్నారు.
- తడబడిన భారత్ బాట్స్మెన్:
రెండో ఓవర్లోనే ఓపెనర్ రోహిత్ శర్మ ఔట్ అయినా.. మరో ఓపెనర్ రాహుల్‌తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ప్రారంభంలో రాహుల్ కాస్త తడబడినా.. తర్వాత బ్యాటుకు పనిచెప్పాడు. ఆడమ్ జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి 14 పరుగులు చేసిన కోహ్లీ అవుటయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కార్తీక్, పంత్, కృనాల్ పాండ్యా ఆకట్టుకోలేకపోయారు. ధోనీ ఆఖరు వరకు క్రీజులో ఉన్నా పరుగులు రావడం మాత్రం కష్టమైంది.
ఆసీస్ బౌలర్లలో నాథన్ కల్టర్ నీల్ మూడు వికెట్లతో మెరిశాడు. బెహ్రన్ డాఫ్, జంపా ప్యాట్ కమిన్స్ తలో వికెట్ తీశారు.
- రాహుల్ శ్రమ వృథా:
రోహిత్ తో పాటు ఓపెనర్ గా బరిలోకి దిగిన రాహుల్ తొలి ఓవర్లో కాస్త తడబడినా అనంతరం రెచ్చిపోయాడు. తనదైన శైలి ఆటతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అదే ఊపు కొనసాగించిన రాహుల్ 35 బంతుల్లో అర్ధశకతకం పూర్తి చేసుకున్నాడు. వెంటనే కల్టర్ నీల్ బౌలింగ్ లో షాట్ కి ప్రయత్నించి అవుటయ్యాడు.
2016 జూన్ తర్వాత వరుసగా రెండు టీ20లు స్వదేశంలో ఓడిపోవడం భారత్ కు ఇదే తొలిసారి.