బెంగళూరు వేదికగా జరుగుతున్న రెండో టీట్వంటీ గెలిచి సిరీస్ పట్టేయాలని చూస్తున్న కంగారులకు 191 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు భారత బాట్స్మెన్. ఈమ్యాచ్‌లో మెన్ ఇన్ బ్లూ గెలుస్తుందా ఓడుతుందా అనేది భారత బౌలింగ్ దళం నిర్ణయిస్తుంది.
టాస్ గెలిచిన ఆసీస్... టీమిండియాకు బ్యాటింగ్ అప్పగించింది. ఓపెనర్లు ధావన్, రాహుల్ మొదటి వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తర్వాత వెంట వెంటనే ధావన్, పంత్ పెవిలియన్ బాట పట్టారు.
ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన కోహ్లి, ధోని సంయమనంతో ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా కోహ్లి... ప్రత్యర్థి బౌలింగ్‌లో అలవోకగా బౌండరీలు సాధించి 72 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 100 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. గత మ్యాచ్‌లో విమర్శలు ఎదుర్కొన్న ధోని 40 రన్స్‌తో ఆకట్టుకున్నాడు.
ఈ క్రమంలో అంతర్జాతీయ టీట్వంటీల్లో అత్యధిక బౌండరీలు(223) సాధించిన కోహ్లి.. శ్రీలంక క్రికెటర్ దిల్షాన్‌తో మొదటి స్థానాన్ని పంచుకున్నాడు.
ఆసీస్ బౌలర్లలో బెహర్డనాఫ్, కౌల్టర్ నైల్, కమిన్స్, షార్ట్ తలో వికెట్ తీశారు. గత మ్యాచ్ స్వల్వ స్కోరుకే కట్టడి చేసిన కంగారు బౌలర్లు ఈ మ్యాచ్‌లో చేతులెత్తేశారు.