ఆఫ్గానిస్థాన్... పేరుకే చిన్న జట్టు. రికార్డులు సాధించడంలో ఎప్పడూ ముందే ఉంటుంది. తాజాగా దెహ్రాదూన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన టీ- ట్వంటీలో 278 పరుగులు సాధించింది. టీ-ట్వంటీలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. 263 పరుగులతో ఆస్ట్రేలియా పేరు మీదున్న రికార్డును చెరిపేసింది.
మొత్తం 472 పరుగులు
కొండంత లక్ష్య ఛేదనను ఐర్లాండ్ ధాటిగానే ఆరంభించింది. అయినా 20 ఓవర్లలో 194 పరుగులే చేయగలిగింది. ఓపెనర్ పాల్ 91 రన్స్ చేశాడు. 84 పరుగుల తేడాతో అఫ్గాన్ విజయం సాధించింది. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి మ్యాచ్‌లో 472 పరుగులు నమోదయ్యాయి.
హజ్రతుల్లా వీరవిహారం
అఫ్గానిస్థాన్ ఓపెనర్ హజ్రతుల్లా ప్రారంభం నుంచి చెలరేగి ఆడాడు. ఐర్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 62 బంతుల్లోనే 162 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టీ-ట్వంటీల్లో రెండో వ్యక్తిగత అత్యధిక స్కోరు చేశాడు.
ఒక్కడే 16 సిక్సర్లు..
టీ-ట్వంటీల్లో ఇన్నింగ్స్ మొత్తంలో 16 సిక్సర్లు నమోదవడమే అరుదు. అలాంటిది ఆఫ్గాన్ ఓపెనర్ హజ్రతుల్లా ఒక్కడే 16 సిక్సర్లు బాది.. ఔరా అనిపించాడు. ఐర్లాండ్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. ఇన్నింగ్స్ తుది వరకు దూకుడుగా ఆడాడు.
చరిత్ర సృష్టించిన ఓపెనర్లు ..
అఫ్గాన్ ఓపెనర్లు చరిత్ర సృష్టించారు. హజ్రతుల్లా, ఉస్మాన్ ఘని తొలి వికెట్‌కు 236 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. టీ-ట్వంటీ చరిత్రలో ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. మ్యాచ్‌లో హజ్రతుల్లా 162 పరుగులు చేయగా, మరో ఓపెనర్ ఉస్మాన్ ఘని 73 పరుగులు చేశాడు.
అంతర్జాతీయ టీ-ట్వంటీల్లో ఈ మ్యాచ్‌తో అఫ్గాన్ రికార్డులు..
- 20 ఓవర్లలో 278-3 పరుగులు. టీ-ట్వంటీల్లో ఇదే అత్యధిక స్కోరు. 2016లో శ్రీలంకపై ఆస్ట్రేలియా చేసిన 263 పరుగులే ఇప్పటి వరకు అత్యధికం.
- 236 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం. పొట్టి క్రికెట్లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం.
- టీ-ట్వంటీ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా హజ్రతుల్లా. మొత్తం 16 సిక్స్‌లు. ఇంతకు ముందు 14 సిక్స్‌లతో అరోన్ ఫించ్ ముందున్నాడు.
- అంతర్జాతీయ టీ-ట్వంటీ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు సాధించిన జట్టు. ఇన్నింగ్స్‌లో మొత్తం 22 సిక్స్‌లు బాదారు ఆఫ్గాన్ బ్యాటర్లు.
- 162 పరుగులతో నాటౌట్‌గా హజ్రతుల్లా. అంతర్జాతీయ టీ-ట్వంటీల్లో ఇది రెండో వ్యక్తిగత అత్యధిక స్కోరు. 172 పరుగులతో ఫించ్ మొదటి స్థానంలో ఉన్నాడు.
- 42 బంతుల్లో హజ్రతుల్లా శతకం. అంతర్జాతీయ టీ-ట్వంటీల్లో ఇది మూడో వేగవంతమైన సెంచరీ . డేవిడ్ మిల్లర్, రోహిత్ శర్మ ఇతని కంటే ముందున్నారు.