నాలుగేళ్లకు ఒకసారి వచ్చే ప్రపంచకప్ అంటే క్రికెట్ ప్రేమికులకు పండగే పండగ. ఈ సారి ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఈ మెగా టోర్నీకి అతిథ్యమిస్తోంది. మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. ఈ క్రికెట్ పండగకు ఇంకా 100 రోజులే మిగిలి ఉంది.
భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లకే విజయావకాశాలు ఉన్నాయని మాజీలు చెబుతున్నారు.
క్రికెట్ అంటే టీమిండియా, టీమిండియా అంటే క్రికెట్ అన్నట్టుంది ప్రస్తుతం. యువ ఆటగాళ్లతో నిండిన భారత్ జట్టు వరస విజయాలతో జోరుమీదుంది. ఇదే ఊపు కొనసాగితే కోహ్లీ బృందాన్ని ఆపడం కష్టమే.
1983లో కపిల్ దేవ్ సారథ్యంలో, 2011లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో ప్రపంచకప్ గెలిచింది భారత్ జట్టు. ఈ సారి ఎలాగైనా కప్పు గెలిచి ధోనికి కానుకగా ఇవ్వాలని మెన్ ఇన్ బ్లూ తహతహలాడుతోంది.
ఇంగ్లండ్ జట్టు..మొదటి సారిగా 1975లో ప్రపంచకప్ ఆడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారైనా కప్పును ముద్దాడలేకపోయింది. 1979, 1987, 1992లో ఫైనల్ వరకు వెళ్లింది. ఇంగ్లండ్ అంటే టెస్టులే ఆడుతుంది అనే అపవాదు ఉండేది ఒకప్పుడు. దాన్ని చెరిపేస్తూ 2016 నుంచి అద్భుతమైన ప్రదర్శనలు చేస్తోంది.
ఈ సంవత్సరం జరిగే ప్రపంచకప్ రేసులో మేమున్నామని ఉరలేకస్తోంది ఇంగ్లీష్ జట్టు. మెగా టోర్నీ జరిగేది వారి దేశంలో కావడం, మోర్గాన్ సారథ్యం, జోరూట్, హేల్స్, రాయ్, బట్లర్ లాంటి బలమైన బ్యాటింగ్ లైనప్ వారికి అదనపు బలం.
ఆస్ట్రేలియా..ఇప్పటివరకు ఐదు సార్లు వరల్డ్ కప్ గెలిచింది. ఈ టోర్నీలో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. బాల్ ట్యాంపరింగ్ నిషేధం తర్వాత స్మిత్, వార్నర్ పునరాగమనం చేస్తుండడం మిగతా జట్టు సభ్యుల్లో ఆత్మవిశ్వాసం నింపుతోంది.
2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఇంగ్లండ్‌లో జరిగింది. తుదిపోరులో టీమిండియాపై పాకిస్థాన్ విజయం సాధించి కప్పు కొట్టింది. ఇప్పుడు అదే విశ్వాసంతో ప్రపంచకప్‌కు సన్నద్ధం అవుతుంది.
2015లో చివరి వరకు వచ్చి కప్పు కొట్టే అవకాశాన్ని కోల్పోయింది న్యూజిలాండ్ జట్టు. విలియమ్సన్ నేతృత్వంలో ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలగా శ్రమిస్తోంది.
దక్షిణాఫ్రికా జట్టు వరల్డ్ కప్‌లో అదిరే ప్రదర్శన చేసి ఏబీ డివిలియర్స్‌కు ప్రపంచకప్‌ను కానుకగా ఇవ్వాలనుకుంటోంది.
1975, 1979లో వరస టైటిళ్లు సాధించిన వెస్టిండీస్..తర్వాత ఆ స్థాయిని అందుకోలేక పోయింది. ఈ ప్రపంచకప్ తర్వాత క్రిస్ గేల్ రిటైర్ కానున్నాడు. మరి అతను ఏ విధంగా ఆడతాడనేది ఆసక్తికరం.