దుబాయ్లో జరగనున్న సమావేశంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి... ప్రపంచకప్లో భారత జట్టు భద్రతపై సందేహలన్నింటినీ తీర్చనుంది. పుల్వామా దాడి తర్వాత ప్రపంచకప్లో పాక్తో భారత్ ఆడకూడదని డిమాండ్లు వినిపించిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలను బహిష్కరించాలని ఐసీసీకి ఓ లేఖ రాసింది బీసీసీఐ పాలక మండలి. పాకిస్థాన్ పేరు మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ సమావేశంలో ఆ లేఖపైనే ప్రధానంగా చర్చ జరగనుంది.
"ప్రపంచకప్లో ఏర్పాటు చేసిన సదుపాయాల వివరాలన్నింటినీ ఐసీసీ సమర్పించనుంది. ఆతిథ్యమిస్తున్న ఇంగ్లాండ్ అండ్ వేల్స్ అత్యున్నత స్థాయిలో ఏర్పాట్లు చేయనుంది" అని ఐసీసీ అధికారి ఒకరు తెలిపారు.
మెగా టోర్నీలో జరిగే పాక్తో మ్యాచ్ను భారత మాజీలు గంగూలీ, హర్భజన్ బహిష్కరించాలని అంటున్నారు. సెమీస్ లేదా ఫైనల్లో పాక్తో తలపడాల్సి వస్తే పరిస్థితి ఏంటనే దానిపై మాత్రం మాట్లాడడం లేదు.
భారత క్రికెట్ దిగ్గజాలైన గావస్కర్, సచిన్ మాత్రం పాక్తో ఆడి గెలవాల్సిందేనని అంటున్నారు. ఆడకపోతే స్వచ్ఛందంగా రెండు పాయింట్లు ఇచ్చినట్లేనని చెప్పారు.
ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నది టీమిండియా కోచ్ రవిశాస్త్రి, సారథి కోహ్లీ మాట.