పాకిస్థాన్‌లో ఖైదీగా ఉన్న కుల్‌భూషణ్ యాదవ్ కేసును నేటి నుంచి నాలుగు రోజులపాటు అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) విచారించనుంది. ఇందుకు నెదర్లాండ్స్‌లోని 'ది హేగ్' వేదిక కానుంది. పుల్వామా ఘటనతో భారత్-పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న తరుణంలో కుల్‌భూషణ్ కేసు విచారణ చర్చనీయాంశమైంది.
ఉగ్రవాదం... గూఢచర్యం...
ఉగ్రవాదం, గూఢచర్యం ఆరోపణలతో 2017ఏప్రిల్‌లో పాకిస్థాన్ సైనిక కోర్టు కుల్‌భూషణ్‌కు మరణశిక్ష విధించింది. పాక్ తీర్పును 2017 మే నెలలో అంతర్జాతీయ కోర్టులో భారత్ సవాలు చేసింది. మరణశిక్ష అమలు చేయకుండా పాక్‌ను ఐసీజే అడ్డుకుంది.
నాలుగు రోజుల పాటు జరిగే విచారణకు భారత్ తరపున మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్ సెల్వి ప్రాతినిధ్యం వహించే అవకాశముంది. నేటి నుంచి 21 వరకు కొనసాగే ఈ విచారణలో ఇరు దేశాలు తమ వాదనలు వినిపించనున్నాయి. తుదితీర్పును ఈ ఏడాది వేసవిలో వెలువడే అవకాశాలున్నాయి.