పాదరక్షలో కొండచిలువేంటి అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే. పాదరక్షలో ఉండటమే కాదు ఏకంగా ఆస్ట్రేలియా నుంచి స్కాట్లాండ్ వరకు విమాన ప్రయాణం చేసింది రెండడుగుల బుల్లి కొండచిలువ. 72 ఏళ్ల వృద్ధురాలు తనకు తెలియకుండానే ఈ జీవిని తనవెంట తీసుకెళ్లింది.
ఆస్ట్రేలియాలోని తన కూతురిని చూసేందుకు వెళ్లిన వృద్ధురాలు స్కాట్లాండ్లోని స్వగృహానికి చేరుకునే వరకు ఈ విషయాన్ని గమనించలేదు. వృద్ధురాలి ప్రయాణ సామానులో భాగంగా భద్రపరుచుకున్న కొత్త పాదరక్షల్లో పైథాన్ తలదాచుకుంది.
క్వీన్స్లాండ్ నుంచి గ్లాస్గో వరకు మూడు విమానాలు మారినా ప్రయాణికురాలు, సిబ్బంది కొండ చిలువను గుర్తించలేదు. తీరా ఇంటికెళ్లి పాదరక్షలను తెరిచి చూస్తే కొండచిలువ దర్శనమిచ్చేసరికి ఆశ్చర్యానికి లోనైంది ఆ వృద్ధురాలు.