పుల్వామా ఉగ్రదాడిని ఖండించిన ఫ్రాన్స్... పాక్ తన భూభాగంలోని ఉగ్రవాద సంస్థలను నిర్మూలించాలని సూచించింది.
"ఉగ్రవాదుల నుంచి భారత్ తన సరిహద్దును కాపాడుకునే చట్టబద్ధ హక్కును ఫ్రాన్స్ గుర్తిస్తుంది. అలాగే పాకిస్థాన్ తన భూభాగంలో జరిగే ఉగ్రవాదుల కార్యకలాపాలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉంది."
_ ఫ్రాన్స్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి
ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు అన్ని విధాలుగా సహకరిస్తామని ఫ్రాన్స్ తెలిపింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని సమూలంగా నాశనం చేయాలని వ్యాఖ్యానించింది. ఉగ్రవాదులకు అక్రమంగా అందుతున్న ఆర్థిక వనరులను స్థంభింపజేయాలని, ఉగ్రవాద నిర్మూలనకు అన్ని దేశాలు కలిసిరావాలని కోరింది.
అలాగే జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ స్థాపకుడు మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితికి విజ్ఞప్తి చేయనున్నట్లు ఫ్రాన్స్ తెలిపింది.
భారత్-పాక్ సంయమనం పాటించాలని కోరింది. పరస్పర దాడులకు పాల్పడకుండా ప్రాంతీయ స్థిరత్వాన్ని సంరక్షించాలని హితవు పలికింది. ఇరుదేశాలు చర్చల ద్వారా సమస్యకు శాంతియుత పరిష్కారానికి కృషిచేయాలని ఫ్రాన్స్ అభిప్రాయపడింది.
భారత్ హద్దు మీరింది...
అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పోంపియాతో పాక్ విదేశాంగశాఖ మంత్రి ఖురేషీ టెలిఫోన్లో చర్చలు జరిపారు. భారత్ వాస్తవాధీన రేఖ దాటి తమ భూభాగంపై దాడి చేసిందని ఇది అంతర్జాతీయ న్యాయసూత్రాలకు విరుద్ధమని తెలిపారు.
పాక్ శాంతినే కోరుకుంటుందని, కానీ దేశ సమగ్రతకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోమని ఖురేషీ తెలిపారు.